పదేళ్లు  ఏకధాటిగా అధికారం.. తన మాటకు ఎదురులేదన్నట్లుగా పరిపాలన. ప్రపంచ స్థాయి నాయకుడిగా గొప్పలు. వచ్చే సారి తమదే గెలుపు అని ప్రకటనలు. ప్రజలకు అద్భుతంగా సేవ చేశామంటూ డబ్బాలు.. కానీ ప్రచారం చూస్తే మాత్రం అంతా మతం చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇది బీజేపీ, నరేంద్ర మోదీ తీరు. వాస్తవానికి నరేంద్ర మోదీ ఎప్పుడైనా దూకుడగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకున్నారు.


ఇటీవల తనను కుటుంబం లేని వారు అన్నారని చెప్పి.. అందరితో మోదీకా పరివార్ అనాలనిపించుకున్నారు. కానీ ఆది ఎక్స్ లో పేరు పక్కన బీజేపీ నేతలు పెట్టుకోవడంతో సరిపోయింది. వాస్తవానికి విపక్షాలను ఎప్పుడూ ప్రధాని తన ట్రాప్ లోకి లాగుతుంటారు. తన దారిలోకి.. తనకు అనుగుణంగా ప్రత్యర్థి పార్టీలు నడుచుకునేలా ప్రచారం చేస్తారు.


400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పగానే.. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్షాలు ప్రాచారం ప్రారంభించాయి. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా ప్రసంగించిన ఫేక్ వీడియో వైరల్ అయింది. ఇది ఫేక్ అని తెలిసినా.. ఆర్ఎస్ఎస్ విధానాలు, రాజ్యాంగ మార్పుపై బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు చూసిన వారు ఇది నిజమేనేమో అని నమ్మారు.


ఫలితం వికసిత్ భారత్ నినాదం కాస్తా.. మోదీ ఎక్కడికి వెళ్లినా తన ప్రాణం పోయేంత వరకు రాజ్యాంగం, రిజర్వేషన్ల జోలికి ఎవరూ రారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈ విధంగా ఈసారి ఎన్నికల్లో మోదీ విపక్షాల ట్రాప్ లో పడ్డారు. దీనికి తోడు తొలి రెండు విడతల్లో పోలింగ్ శాతం తగ్గడం.. ఇవి బీజేపీపై ప్రభావం చూపుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడటంతో.. కాంగ్రెస్ ఆస్తులు లాగేసుకుంటుంది.. మంగళసూత్రాలను సైతం ముస్లింలకు తాకట్టు పెడుతుంది వంటి మత పరమైన అంశాలను రెచ్చగొడుతున్నారు. మొత్తం మీద వన్ సైడ్ అనుకున్న ఎన్నికలు  ఫలితాలు ఎలా ఉంటాయో అనే ఆసక్తిని అందరిలో కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: