ఏపీలో 2011లో జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు అయ్యాయి. ఈ దర్యాప్తును సీబీఐ కేవలం రెండేళ్లలో ముగించింది. 2013లోనే కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అప్పటి నుంచి ఈ కేసులో పురోగతి లేదు. ఈ నేపథ్యంలో సీబీఐకి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. దీంతో కేసుల జాప్యానికి గల కారణాలను సీబీఐ వెల్లడించింది. సీబీఐ చివరి చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత నిందితులు కేసు విచారణను అడ్డుకునేందుకు ఏం చేశారో వివరించింది. 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లను నిందితులు దాఖలు చేయడంతో కేసు విచారణ ఇంకా సాగుతోందన్నారు. కేవలం విచారణను అడ్డుకునేందుకు, జాప్యం చోటు చేసుకునేందుకే ఇలా చేసినట్లు వాదించింది. ఆ క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లను పూర్తిగా విచారించకుండానే కోర్టులో జడ్జిలు మారిపోతున్నారని సుప్రీంకోర్టు దృష్టికి సీబీఐ న్యాయవాదులు తెలియజేశారు. ఈ కేసులో నిందితులు బాగా శక్తివంతులు కావడంతో కేసు విచారణ ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. పిటిషనర్ రఘురామకృష్ణం రాజు కోరినట్లు మరో రాష్ట్రానికి సీబీఐ విచారణ మారిస్తే మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో మొత్తం సాక్షులు 911 మంది ఉన్నట్లు సీబీఐ నివేదించింది. అయితే వారంతా 50 ఏళ్లు దాటిన వారని, కేసును మరో రాష్ట్రానికి మారిస్తే విచారణలో మరిన్ని అడ్డంకులు వస్తాయని సీబీఐ పేర్కొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి