* హంద్రీ నీవా ప్రాజెక్టు అటకెక్కినట్టేనా..

•ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలస పోతున్న ప్రజలు

•ఎలక్షన్స్ సమయంలో తప్ప ప్రజలను పట్టించుకోని నాయకులు


(రాయలసీమ - ఇండియా హెరాల్డ్)
రాయలసీమ.. గత కొన్ని దశాబ్దాల క్రితం నవరత్నాలు పండిన నేల.. ఇప్పుడు కరువు సీమగా మారిపోయింది. ఎంతో ఉన్నతంగా బ్రతికిన ప్రజలు నేడు బ్రతుకుతెరువు కోసం పక్క రాష్ట్రాలకు వలస పోతుంటే.. సొంత ఇంటిని వదిలి ఎక్కడో అనాధలుగా బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఇక అధికారుల మాట ఎత్తితే.. ఓటు వేయించుకోవాల్సిన సమయం దగ్గర పడితే.. ప్రజలే దేవుళ్ళు అంటూ వారి చుట్టూ తిరుగుతారు.. అదే ఓటింగ్ కాస్త అయిపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెవరో మాకు తెలియదు అంటూ పట్టనట్టుగా తిరుగుతూ ఉంటారు .. ప్రస్తుతం సీమ ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.. ప్రభుత్వాలు మారిన ప్రజా సమస్యలు మాత్రం తీరడం లేదు.. పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారు..  కానీ వారికి కావలసిన నిత్యవసరాలను మాత్రం తీర్చడం లేదు..


ఇక ప్రత్యేకం గా రాయలసీమ అనంతపురం విషయానికి వస్తే.. ఒకప్పుడు వజ్రాలు పండిన నేల ఇప్పుడు రాళ్ళను చూస్తోంది.. భూములు బీటలు మారిపోయి.. పంటలు పండక.. రైతులు తీరని కష్టాలు పడుతున్నారు..రైతులే అద్వాన స్థితిలో ఉన్నారు అంటే వారిని నమ్ముకున్న చాలామంది జనం ఏమైపోతున్నారో ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వాలు.. అందుకే చాలామంది బ్రతుకుతెరువు కోసం పక్క రాష్ట్రమైన కర్ణాటక , బెంగళూరుకు వలస వెళ్తూ.. అక్కడ పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.. ఇకపోతే రాయలసీమలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు గత దశాబ్ద కాలానికి పైగా నిలిచిపోయాయి.. మరొకవైపు తాగునీరు లేక ఇంకొక వైపు ఉపాధి లేక ఇలా చాలామంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం చాలా బాధాకరం అని చెప్పవచ్చు.

 హంద్రీనీవా కాలువ విస్తరణలో 3,850 క్యూసెక్కుల ప్రవాహానికి వీలుగా..రూ.1,030 కోట్లతో హంద్రీనీవా ప్రాజెక్టు విస్తరణకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.. అయితే ఆ సమయంలో రూ.285.77 కోట్లు ఖర్చు చేసింది టిడిపి ప్రభుత్వం.. ఇక రాయలసీమలోని కర్నూలు , అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు.. 35 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో హంద్రీనీవా పథకాన్ని చేపట్టారు. శ్రీశైలం ఎగువన నందికొట్కూరు మండలం మాల్యాల లిఫ్ట్ ద్వారా 40 టీఎంసీలు కృష్ణ వరద జలాలు ఎత్తిపోసి కరువు పల్లెల కన్నీళ్లు తుడవాలి.. మెట్ట చేలను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ఫేస్ వన్ కింద మాల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 216.30 కి. మీ.లో ప్రధాన కాలువ 8 లిఫ్టులు నిర్మించారు. 12 పంపుల ద్వారా 3850 క్యూసెక్కులు ఎత్తిపోయాల్సి ఉంటుంది... అయితే ఈ ప్రాజెక్టు పనులు మాత్రం ఎక్కడికక్కడ ఆగిపోయాయి తన ప్రభుత్వంలో జగన్ టెండర్లు పూర్తి చేసి 28 నెలలు గడిచిన పనులు మొదలు పెట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది.. ఇక ఇక్కడ ఉపాధి హామీ లేక మరొకవైపు పంటలు లేక అటు రైతులు ఇటు కూలీలు కూడా వలస వెళ్లిపోతున్నారు. ఏది ఏమైనా చాలామంది నాయకులు అధికారంలోకి వస్తున్నారు కానీ అధికారంలోకి వచ్చి ప్రజల ఆర్తనాధాలను తీర్చే వారే లేకపోవడం నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: