•ఏండ్లు గడిచినా రైతుల జీవితాల్లో మార్పు లేదు..
• ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థలో రైతులకు ఏది భరోసా..

 ఈ దేశానికి రాజు ఎవరంటే చాలామంది  ప్రధాని పేరు చెబుతుంటారు. కానీ నిజానికి దేశానికి రాజు రైతు. ఆయన పంట లేనిదే ఆ ప్రధాని కూడా బతకలేరు. అలాంటి  రైతు పేరు రాజు అని పిలవబడుతోంది కానీ ఆయన నిజ జీవితంలో రాజసం మాత్రం లేదు. రైతును రాజు చేస్తామని నాటి రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వాలు చెబుతూ వస్తూనే ఉన్నాయి. రైతును రాజు చేసింది లేదు, రైతు పంట పండించడం ఆపింది లేదు. లాభమో నష్టమో వచ్చిన కాడికి ఆయన పంటలు పండిస్తూ దేశానికి కాస్త అన్నం పెడుతున్నాడు. అలాంటి రైతుల కోసం పాలకులు సహకారం అందించడంలో విఫలమవుతున్నారు.


 గత 60 ఏళ్ల పాలనలో  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రైతులకు  చేసింది ఏమీ లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా  రైతులు నీళ్లు లేక పంటలు పండించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.. ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు. వారి ఆస్తులు పెరుగుతున్నాయి రైతుల కండలు కరుగుతున్నాయి. అయినా ఏ ఒక్క ప్రభుత్వం రైతు పండించే రెండు పంటలకు నిరంతరంగా నీళ్లు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. వర్షాలు పడి గట్టిగా కాలం అయితే తప్ప రైతుకు మరోరకంగా నీరందే పరిస్థితి తెలియదు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వాలు గద్దెనెక్కుతున్నాయి. రైతుల కోసమే తమ ప్రభుత్వం అని ప్రగల్బాలు పలుకుతున్నాయి.

 అలా రైతుల పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నారు తప్ప ఏనాడు రైతుపై దృష్టి పెట్టిన దాఖలాలు అయితే లేవు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు వేసిన పంటల్లో సగం వరకు ఎండిపోయాయి. నెక్స్ట్ సీజన్లో అసలు పంటలు వేసే పరిస్థితి కూడా లేదు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో  ఈ పరిస్థితి ఏర్పడింది. తలాపున గోదావరి ఉన్నా కానీ ఆ నీటిని తీసుకొచ్చే ప్రభుత్వాలు కరువయ్యాయి. కాళేశ్వరం పేరుతో  కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు.కానీ ప్రస్తుతం రెండో పంటకు నీళ్లు ఇచ్చే పరిస్థితి మాత్రం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా కానీ  తెలంగాణ రైతుల బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదనేది జగమెరిగిన సత్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: