తమిళనాడు: ఎండా కాలం కావడంతో పిల్లలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి . తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజూ వారి సరదా కోసం బీచ్‌లు, పార్కులకు తీసుకెళ్లడం మనం చూడవచ్చు. ఇటీవల తమిళనాడులోని తూత్తుకుడి బీచ్ షాపుల్లో కల్తీ, అపరిశుభ్రమైన ఆహారాన్ని విక్రయిస్తున్నారు. రోచె పార్క్ బీచ్, ముత్తు నగర్ బీచ్‌లోని పానీ పూరీ స్టాల్ లో తింటున్న పిల్లలు, పెద్దలకు కూడా డయేరియా ఇంకా ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది.భద్రతను పట్టించుకోని వ్యాపారులు పలుమార్లు అపరిశుభ్రమైన ఆహార పదార్ధాలని విక్రయిస్తున్నారు. 


ఈ విషయంపై ఇండియా హెరాల్డ్ దర్యాప్తు చేసినప్పుడు, డాక్టర్ తాయమ్మాళ్ మాట్లాడుతూ, "ఆహార భద్రత మార్గదర్శకాలు పాటించడం లేదు. అలాగే ఈ విషయం పై అధికారులు కూడా సరిగ్గా తనిఖీలు చేయడం లేదు.ఈ అపరిశుభ్రమైన పానీ పూరీ నా బిడ్డకు ఆరోగ్య సమస్యలను సృష్టించింది. రోజ్ మిల్క్ , శీతల పానీయాలలో హానికరమైన రసాయనాలు ఉన్నాయి.పైగా అవి  తిరిగి వాటి తయారీలోనే ఉపయోగించబడతాయి. చాలా హానికరమైన నూనెని మళ్ళీ మళ్ళీ ఆహారాల్లో వాడుతున్నారు. ఇది స్పష్టమైన ఉల్లంఘన." అని అన్నారు.


అలాగే "రోచె పార్క్ బీచ్‌లో, ఒక స్టాల్‌లో, పరిశుభ్రత చాలా తక్కువగా ఉందని మేము కనుగొన్నాము, మరొక స్టాల్‌లో, లేబుల్స్ లేకుండా ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు మేము కనుగొన్నాము." అని మరొక సామాన్యుడు అన్నారు, సుధాకర్ అనే మరో వ్యక్తి మాట్లాడుతూ, "ఉపయోగించిన కృత్రిమ రంగులు విషపూరితమైనవి. అవి క్యాన్సర్ కి కారణం కావచ్చు. అలాగే మినరల్ వాటర్ బాటిల్స్ కూడా తప్పుగా బ్రాండ్ చేయబడ్డాయి. మేము ఎరేటెడ్ డ్రింక్స్ ఇంకా ప్యాక్ చేసిన నీటిలో నాణ్యత లేకపోవడం గమనించాము" అని చెప్పారు.


అలాగే విజయ్ శంకర్ అనే వ్యక్తి మాట్లాడుతూ, "అధికారులు శాంపిల్స్‌ను తనిఖీ చేసి, ఆహారపదార్థాలు 'సురక్షితమైనవి' అని ప్రకటించే స్టిక్కర్లను వ్యాపారులకు అందించాలి. కానీ అధికారులెవరూ తూత్తుకుడి బీచ్‌లలో అలా తనిఖీలు చేయరు. చెన్నైలో, అధికారులు చాలా ఔట్‌లెట్‌లను 'అసురక్షిత'గా ప్రకటించారు, స్టాళ్లపై అలాంటి స్టిక్కర్లను అతికించారు. అందువల్ల అలా చేస్తే సురక్షితంగా ప్రకటించబడిన అవుట్‌లెట్‌ల వద్ద మాత్రమే సందర్శకులు ఆహారాన్ని తీసుకుంటారు. అలాగే వారి లైసెన్స్‌లు కూడా ఖచ్చితంగా ధృవీకరించబడాలి." అని అన్నారు. 


ఇలా అక్కడ సామాన్యులు అవస్థలు పడి తమ బాధలని, సలహాలని చెప్పుకున్నారు. మరి తూత్తుకుడి అధికారులు ఈ విషయాన్ని పట్టించుకుంటారో గాలికి వదిలేస్తారో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: