విశాఖ భూదందాలపై వైసీపీ సర్కార్ మరో సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ ఈ రోజు నుంచి విచారణ జరపనుంది, మూడేళ్ళ క్రితం నాటి టీడీపీ సర్కార్ హయాంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని భూములను దోచేశారు. అందిన కాడికి మడతేశారు. మొత్తంగా దురాక్రమణ చేస్తూ ప్రభుత్వం, ప్రైవేట్ అన్న తేడా లేకుండా వేల కోట్ల రూపాయల  దందా చేసారు. దీని మీద బాబు సర్కార్ తూతూ మంత్రంగా సిట్ పేరిట ఒక విచారణ కమిటీని నియమించింది. కానీ దాని నివేదిక ఏంటో ఇప్పటివరకూ తెలియలేదు.


వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త సిట్ ని ఏర్పాటు చేస్తామని చెప్పినట్లుగానే తాజాగా నియమించింది. దీని మీద  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సిట్ విచారణ సక్రమంగా సాగుతుందని చెప్పారు. ఎవరైతే భూములు దోచుకున్నారో వారి భరతం పడతామని హెచ్చరించారు. కోరలు తీస్తామని కూడా చెప్పారు. ఎంతటి పెద్ద వారు ఈ భూదందాలో ఉన్నా కూడా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు.


మరో వైపు పవన్ కళ్యాణ్ మీద ఆయన హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు దత్తపుత్రుడు పవన్ అన్నారు. బాబు జేబులో బొమ్మ అని కూడా సాయిరెడ్డి విమర్శించారు.  పవన్ కి ప్రజాదరణ లేదని  రెండు ఎన్నికల్లో తన  ఓటమి ద్వారా తేలిపోయిందని చెప్పారు. బాబు పవన్ ఒక్కటేనని ప్రజలు  ఓడించారని చెప్పారు. ఇసుక దోచుకుంటున్న వారు వైసీపీ నేతలు అంటే వూరుకోమని, నిరూపించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ పవన్ కి సవాల్ చేశారు. తాను కానీ పార్టీ నాయకులు కానీ ఇసుక దందాలో ఉన్నట్లు రుజువు చేస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటామని ఆయన ప్రకటించారు. పవన్ తన పార్టీని టీడీపీలో విలీనం చేసుకోమని ఆయన సలహా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: