టీటీడీ పాలకమండలి తికమక నిర్ణయాలతో తల పట్టుకుంటున్నారు అధికారులు. లడ్డూ ప్రసాదం ధర, వసతి గదుల అద్దె పెంచిన టీటీడీ.. ఆదాయం కోసమని చెప్పింది. అదే పాలకమండలి ఇప్పుడు ఎక్కువ వడ్డీ ఇచ్చే ప్రైవేటు బ్యాంకుల్ని కాదని.. డిపాజిట్లు జాతీయ బ్యాంకులకే పరిమితం చేయాలనే నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.  దీంతో బడ్జెట్ లోటును ఎలా పూర్తి చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు టీటీడీ అధికారులు. 

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఆదాయానికి మించి ఖర్చు ఉండటంతో.. లోటు బడ్జెట్ తప్పడం లేదు. ఇదే సమయంలో పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలు టీటీడీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జేట్ 3వేల 116 కోట్ల రూపాయలకు చేరుకుంది. టీటీడీకి ప్రధాన ఆదాయ వనరు హుండీ ఆదాయమే. తరువాత ప్రధానంగా ఫిక్సేడ్ ఢిఫాజిట్లు పై వడ్డి ద్వారానే ఆదాయం లభిస్తోంది. గత ఏడాది హుండీ ద్వారా రూ.1206 కోట్లు లభిస్తే...ఈ ఏడాది హుండీ ద్వారా రూ.1231 కోట్లు ఆదాయం లభిస్తూంది అని అంచనా వేసింది టీటీడీ. ఇక వివిధ బ్యాంకులో వున్న రూ.12,800 కోట్లు ఫిక్సేడ్ డిపాజిట్లు పై గత ఏడాది రూ.800 కోట్లు ఆదాయం లభించగా......ఈ ఏడాది రూ.846 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇప్పటికే ఆర్బీఐ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడు పాలకమండలి కూడా డిపాజిట్లు జాతీయ బ్యాంకుల్లోనే చేయాలని నిర్ణయం తీసుకోవడంతో.. వంద కోట్ల వరకు ఆదాయం తగ్గనుంది. 

టీటీడీకి సంబంధించిన నిబంధనలు మేరకు రూ.5వేల కోట్లు వరకు ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేసే వెసులుబాటు ఉంది. మరో వైపు మూల ధనంలో 25 శాతానికి మించి ఒకే బ్యాంకులో డిపాజిట్ చేయకూడదన్న నిబంధన కూడా ఉంది. బ్యాంకుల విలీనం తరుణంలో.. ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ లో డిపాజిట్లు 25 శాతానికి చేరుకున్నాయి. ఇక డిపాజిట్లు స్వీకరించలేమని ఈ రెండు బ్యాంకులు టీటీడీకి చెప్పేశాయి. దీంతో ప్రైవేట్ బ్యాంక్ లో మెచ్యూర్ అయిన రూ.1400 కోట్ల డిపాజిట్లు ఎక్కడ వేయాలని పాలకమండలి చర్చించింది. చివరకు ప్రైవేట్ బ్యాంకులో కాకుండా జాతీయ బ్యాంకులో వేయాలని పాలకమండలి నిర్ణయించింది. డిపాజిట్ల భద్రత కోసమే పాలకమండలి ఈ దిశగా ఆలోచించినట్లు సమాచారం. పాలకమండలి నిర్ణయంతో ప్రైవేట్ బ్యాంకులో 8.6 శాతంగా వస్తున్న వడ్డి...6.57 శాతానికి పడిపోయింది. దీంతో 1400 కోట్ల డిపాజిట్లపై వడ్డీ ఆదాయం 28 కోట్లు తగ్గుతుంది. మరో 5 వేల కోట్లు కూడా మెచ్యూరిటీ తీరాక జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేస్తే.. వంద కోట్ల వరకు ఆదాయంలో నష్టం తప్పదు. వాస్తవానికి హుండీ ఆదాయాన్ని కార్పస్ ఫండ్ గా ప్రకటించిన టీటీడీ.. అవి కూడా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అయితే ఏటా ఖర్చులు పెరుగుతుండటంతో.. మొత్తం వ్యయం చేస్తోంది టీటీడీ. గత ఏడాది 200 కోట్లు డిపాజిట్ చేయాలని నిర్ణయించినా.. చివరకు రూ.86 కోట్లతో సరిపెట్టారు. ఈ ఏడాదికి అంచనా మొత్తమే రూ.79 కోట్లు కాగా...... ప్రస్తుత నిర్ణయంతో.. ఉన్న డిపాజిట్లు కూడా తీసి వ్యయం చేయాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: