ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కరోనా కట్టడి కావడం లేదు. వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో ఎక్కువగా కేసులు వెలుగు చూస్తున్న దేశాల జాబితాలోకి మన దేశం కూడా చేరిపోయింది. అమెరికా, బ్రెజిల్‌, రష్యా తర్వాత అత్యధికంగా భారత్‌లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను,  ప్రజలను ఈ గణాంకాలు కలవరపెడుతున్నాయి.

 

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత వారం రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఐదారు వేలకు తగ్గడం లేదు. దీంతో ఒక్కరోజులో ఎక్కువగా కేసులు వెలుగు చూస్తున్న దేశాల జాబితాలో భారత్‌ టాప్‌-5లో నిలిచింది. అమెరికా, బ్రెజిల్‌, రష్యా తర్వాత  భారత్‌లోనే ఈ సంఖ్య ఎక్కువగా ఉంది.

 

ఈ నెల ప్రారంభంలో దేశంలో ఒకరోజు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య 2 వేల 400 దాటింది. మే మొదటి వారం తర్వాత ఆ సంఖ్య 3 వేలు దాటింది. గత వారం రోజులుగా కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య 5 నుంచి 6 వేల మధ్య  ఉంటోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 6 వేల 654 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య  లక్షా పాతిక వేలు దాటింది. మృతుల సంఖ్య 3 వేల 800 కు చేరువవుతోంది.  

 

ఇతర దేశాల్లో పరిస్ధితి చూస్తే...రోజువారీ కొత్త కేసుల నమోదు విషయంలో అమెరికానే టాప్. అక్కడ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే మరణాలు లక్షకు చేరువయ్యాయి.   మొత్తం కేసుల సంఖ్య పదహారున్న లక్షలు దాటింది. బ్రెజిల్‌లో సైతం గత కొన్ని రోజులుగా 20వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఈ విషయంలో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. మొత్తం అక్కడ పాజిటివ్‌ కేసులు సుమారు 3 లక్షల 15 వేలు . 20వేల మందికి పైగా  మరణించారు. రష్యాలో 8 వేల వరకు కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువవుతోంది.  మరణాల సంఖ్య సుమారు 3 వేల 300కి చేరింది. ఆ తర్వాత స్థానం  మన దేశమే.

 

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మొదట్లో తక్కువగా నమోదు కావడానికి పరీక్షల సంఖ్య కూడా ఓ కారణం. ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు లక్ష వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.  మే 9-10 తేదీల్లో మొత్తం పరీక్షల సంఖ్య 10 లక్షలుగా ఉండగా.. మే 22 నాటికి మొత్తం 27 లక్షల 55  వేల పరీక్షలు నిర్వహించారు.  దీంతో కేసుల సంఖ్య పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి.  లక్షా 25 వేల కేసులు నమోదు కావడానికి భారత్‌కు పట్టిన సమయం 115 రోజులు కాగా.. బ్రిటన్‌లో 53 రోజులు, అమెరికాలో 69, రష్యాలో 93 రోజులు.

 

కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు  కేంద్ర ప్రభుత్వం చాలా వరకు సడలింపులు ఇచ్చింది. మే 31 తర్వాత మరిన్ని సడలింపులు వచ్చే అవకాశం ఉంది.  ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తే తప్ప కరోనా కట్టడి సాధ్యమయ్యే పరిస్ధితి కనిపించడం లేదు.   మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం, సోషల్ డిస్టెన్స్  ద్వారానే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: