కరోనా దెబ్బకు అన్ని రంగాలు విలవిల్లాడుతున్నాయి. వాటిలో రియల్ ఎస్టేట్ రంగం ఒకటి. ఎక్కడైనా భూముల ధరలు పెరుగుతూనే ఉంటాయి. లేకపోతే.. ఏదో ఒక ధర వద్ద ఆగిపోతాయి. కానీ భూముల ధరలు తగ్గడం చాలా అరుదు. కానీ ఏపీలో మాత్రం ఏకంగా సర్కారే భూముల రిజిస్ట్రేషన్ ధరలను తగ్గిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు, స్థలాల మార్కెట్‌ విలువల సవరణలో భాగంగా ధరలు ఎక్కడైనా ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తే వాటిని పరిశీలించి తగ్గించే అధికారం సబ్‌రిజిస్ట్రార్లకు ఏపీ సర్కారు ఇచ్చేసింది.

 

 

కాలానుగుణంగా భూముల మార్కెట్ విలువలు ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ సవరణ అంతా పెంచడమే ఉంటుంది. అసలు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ధర అంటేనే చాలా తక్కువగా ఉంటుంది. ఆ ధరకు కొన్ని రెట్లు మార్కెట్ విలువ ఉంటుంది. ఒకవేళ ఏదైనా భూమి ధర తగ్గించాలన్నా, పెంచాలన్నా జిల్లా రిజిస్ట్రార్‌కు అధికారం ఉంటుంది. ఏపీ సర్కారు ఆగస్టు 1 నుంచి భూములు, స్థలాల ధరలను పెంచి ఆ మేరకు రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించింది.

 

 

అయితే ఈసారి అవసరమైన చోట్ల భూముల రేట్లను తగ్గించే అధికారం కూడా ఇచ్చింది. కొన్ని చోట్ల అడ్డగోలుగా ధరలు ఉన్న చోట్ల సవరించేందుకే ఈ అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఏదేమైనా సర్కారు భూముల రిజిస్ట్రేషన్ ధరలను అవసరమైతే తగ్గించాలని చెప్పడం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఎక్కడ ధరలను తగ్గించే అవకాశం ఉందోనన్న చర్చ ఆయా వర్గాల్లో మొదలైంది.

 

 

ప్రభుత్వం ధరలు తగ్గించే ప్రాంతాలను తమ తమ వర్గాల ద్వారా ముందుగానే తెలుసుకుని ఆ చుట్టుపక్కల భూములు కొనేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. కొత్త గా భూములు కొనుక్కోవాలనుకునే వారికి ప్రభుత్వ నిర్ణయం బాగా కలిసి వచ్చేలా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: