బ్రిటన్ ప్రధాని నిర్లక్ష్యం వల్లే కరోనా ఆ దేశంలో విజృంభిస్తోందా..? ఆయన ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లే బ్రిటన్ కరోనా ముప్పు ముంగిట నిలిచిందా..? వైరస్ కట్టడిలో ప్రధాని సమర్ధవంతంగా పనిచేయలేకపోయారా..? అంటే యస్ అంతా నా వల్లే జరిగిందంటూ తన తప్పును అంగీకరించారు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి బ్రిటన్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అత్యధిక మరణాలు నమోదైన దేశంగా మూడో స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితికి ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వ విధానాలే కారణమని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా బోరిస్ జాన్సనే అంగీకరించారు. తొలినాళ్లలో వైరస్ కట్టడిలో తాము సమర్థంగా పనిచేయలేకపోయామని తెలిపారు. ఇంకా మెరుగైన చర్యలు తీసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు జాన్సన్.
లాక్‌డౌన్ విధింపులో ఆలస్యం చేశామన్న ఆరోపణలు ఉన్నాయని.. ఆ విషయంలో తన పాలకవర్గం ఇంకా ముందు చూపుతో వ్యవహరించి ఉండాల్సిందని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లక్షణాలు లేని వారి నుంచి కూడా వైరస్ ఈ స్థాయిలో వ్యాపిస్తుందని తొలినాళ్లలో అంచనా వేయలేకపోయామన్నారు జాన్సన్.
మరోవైపు మహమ్మారితో మరణించిన ప్రతి ఒక్కరికి జాన్సన్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని చర్యలకు తానే బాధ్యత వహిస్తున్నానన్నారాయన. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 45 వేల 677 మంది మరణించారు. కొత్త కేసుల సంఖ్య మే నెల నుంచి తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతోంది. అయితే మరోసారి విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి ప్రధాని బోరిస్ జాన్సన్ చేసిన తప్పును ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తాను చేసిన తప్పేనంటూ ఒప్పుకున్నాడు. అందువల్లే తమ దేశం తగిన మూల్యం చెల్లించుకుంటుంది అంటూ చెప్పకనే చెప్పాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి