పోలవరం దాదాపు ఎనభై ఏళ్ళ చరిత్ర కలిగినది. 1940 దశకంలో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తరువాత నలభైయేళ్లకు అంటే 1980 సమయంలో నాటి కాంగ్రెస్ సీఎం టంగుటూరి అంజయ్య పోలవరానికి శంఖుస్థాపన చేసి ఉనికి చాటారు.   మళ్లీ వైఎస్సార్ సీఎం అయిన తరువాత అంటే 2004 కాలంలో పోలవరం పురుడు పోసుకుంది, అప్పటి నుంచి నత్త నడక నడుస్తూ పదహారేళ్ళ విలువైన కాలం అలా కరిగిపోయింది. ఇపుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే దండీగా నిధులు కావాలి.

అంటే దాదాపుగా 55 వేల కోట్లు అన్న మాట. ఇందులో మెజారిటీ వాటా పునరావాస ప్యాకేజీకే  పోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ని విభజన సమయంలో కేంద్రం జాతీయ ప్రాజెక్ట్ గా టేకప్ చేసింది. కానీ ఇప్పటికి ఆరేళ్ళుగా తీసుకుంటే ఏపీలో రెండు ప్రభుత్వాలు మారాయి కానీ సగం నిధులు కూడా కేంద్రం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవన్నీ పక్కన పెడితే పోలవరం ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన పునరావాస నిధులకే కేంద్రం డుమ్మా కొట్టేలా వ్యవహరిస్తోందని అంటున్నారు.

ఇక పోలవరం నిధుల విషయంలో అనేక రకాలైన తగ్గింపు చర్యలకు కూడా కేంద్రం దిగుతోందని అంటున్నారు. చివరికి ఎక్కడ 55 వేల కోట్లు ఎక్కడ 20 వేల కోట్లు అన్నట్లుగా సీన్ తయారైంది. అటూ ఇటూ కధ తిప్పి 20 వేల కోట్ల వరకే అంటే 2014 విభజన నాటి లెక్కలకే తాము పరిమితం అవుతామని కేంద్రం తాజాగా చెబుతోంది, ఇందులో దశలవారీగా ఇచ్చిన కొన్ని నిధులు, నాబార్డు నుంచి కేంద్రం చెల్లించిన మొత్తాలు కలుపుకుంటే 16 వేల కోట్ల రూపాయల దాకా ఇచ్చేశామని లెక్కలు చెబుతున్నారు. అంటే నిఖార్సుగా చెప్పుకోవాలంటే కేంద్రం నుంచి ఇక ఏపీకి  వచ్చేవి నాలుగు వేల కోట్లేనట.

మరి పునరావాస ప్యాకేజ్ కే దాదాపు 35 వేల కోట్లు ఖర్చు చేయాలి. ఆ సొమ్ము ఎవరు భరిస్తారు.ఇవన్నీ చూసుకుంటే పోలవరం విషయంలో మోడీ అతి పెద్ద షాక్ ఇచ్చారా అన్న మాట అయితే వినిపిస్తోంది. అదే జరిగితే ఏపీకి పోలవరం గుదిబండగా మారుతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: