తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి పండగ పూట కూడా తిప్పలు తప్ప లేదు. రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్యా చర్చలు ఫలించకపోవడంతో.. జనం ఇబ్బందులు పడుతూనే సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ తిప్పలు ఎప్పుడు తప్పుతాయోనని నిట్టూరుస్తున్నారు.

దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండగలు వచ్చాయంటే చాలు.. తెలుగు రాష్ట్రాల మధ్య తిరిగే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ భారీగా కనిపించేది. బస్టాండ్లు కిటకిటలాడేవి. సీటు దొరక్కపోయినా, నిలబడి అయినా ఎలాగోలా పండక్కి ఊరెళితే చాలనుకునే వాళ్లు జనం. కానీ ఓ వైపు కొవిడ్‌, మరోవైపు రెండు రాష్ట్రాల ఆర్టీసీల పంతాలతో.. ఈసారి పండక్కి సామాన్యుడు తిప్పలు పడుతూనే ఊరెళ్లాల్సి వచ్చింది.

రెండు రాష్ట్రాల మధ్యా బస్సులు తిప్పని ఆర్టీసీలు.. చాలా పెద్దమనసుతో సరిహద్దుల దాకా సర్వీసులు నడుపుతున్నాయి. విజయవాడ వైపు, కర్నూలు వైపు, నాగార్జునసాగర్‌ వైపు వెళ్తున్న బస్సులు.. బోర్డర్‌కు 2 కిలోమీటర్ల ఇవతలే నిలిచిపోతున్నాయి. అక్కడి నుంచి మళ్లీ లగేజ్‌ సర్దుకొని.. ఏ ఆటోనో పట్టుకుని సరిహద్దు దాటి బస్సెక్కాల్సి వస్తోంది.. ప్రయాణీకులకు. సందట్లో సడేమియాలా.. 2 కిలోమీటర్ల దూరానికి ఒక్కో ప్రయాణికుడి నుంచి 50 రూపాయల వసూలు చేస్తూ, కుక్కేసి తీసుకెళ్తున్నారు.. ఆటోవాలాలు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని మాత్రం.. ఇంకా అవగాహన కుదరకపోవడం వల్లే రెండు రాష్ట్రాల మధ్యా బస్సులు తిరగడం లేదన్నారు. ప్రస్తుతానికి సరిహద్దుల వరకు సర్వీసులను నడుపుతున్నామని చెప్పారు. పండక్కి ఊరెళ్లేందుకే కాదు.. పండగ తర్వాత మళ్లీ పని చేసుకునే ప్రాంతాలకు వెళ్లాలన్నా ఇలాగే ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిరావడంతో.. ఈ తిప్పలు ఇంకా ఎన్నాళ్లు ఉంటాయోనని ప్రయాణీకులు నిట్టూరుస్తున్నారు.

మొత్తానికి దసరా పండుగకు ఊరికి వెళ్లి సరదాగా  గడుపుదామనుకున్న వారికి ప్రయాణ కష్టాలు వెంటాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ప్రయాణీికులు. దీంతో సందట్లో సడేమియాలా ప్రైవేట్ ట్రావెల్స్ ప్యాసింజర్స్ నుంచి నిలువులా దోచేస్తున్నాయి.  





మరింత సమాచారం తెలుసుకోండి: