సొంత పార్టీలో ఏర్పడిన ముసలంతో ఉక్కిరి బిక్కిరైన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి.. ఏకంగా పార్లమెంట్‌నే రద్దు చేశారు. రాజ్యాంగబద్ద వ్యవస్థల్లో తనకు కావల్సిన వారిని నియమించుకునేలా రాజ్యాంగ కౌన్సిల్ చట్టాని సవరణ చేస్తూ.. ఓలీ సర్కారు వారం రోజుల క్రితం ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ రద్దు చేయాలంటూ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలోని ప్రధాని ఓలి విరోధులు.. డిమాండ్ చేస్తున్నారు. ఓలి వ్యతిరేక వర్గానికి మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నాయకత్వం వహిస్తున్నారు. ఆర్డినెన్స్ వివాదం మీద పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందని భావించిన ఓలి... పార్లమెంట్ రద్దుకు సిఫార్సు చేశారు
కరోనాను కట్టడి చేయడంతో పాటు... ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఓలి దారుణంగా విఫలం అయ్యారని ఆయన సొంత పార్టీలో నేతలే విమర్శిస్తున్నారు. పార్లమెంటరీ పార్టీతో పాటు సెంట్రల్ కమిటీ పార్టీ సెక్రటేరియట్‌లో ఓలికి మద్దతిచ్చేవారి సంఖ్య తగ్గిపోయిందని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించింది. ప్రధానమంత్రి పదవితో పాటు పార్టీ సహ అధ్యక్ష పదవికీ ఓలీ రాజీనామా చేయాలని ఆయన వ్యతిరేకులు పట్టుబడుతున్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేకనే ఆయన పార్లమెంట్ రద్దుకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ రద్దు కావడంతో మధ్యంతర ప్రభుత్వానికి ఓలి నేతృత్వం వహించనున్నారు. వివాదాస్పద ఆర్డినెన్స్ విషయంలో మొదట్లో పార్టీ ఒత్తిడికి తలొగ్గిన ప్రధాని.. తర్వాత మనసు మార్చుకున్నారు. అసమ్మతి వర్గానికి నాయకత్వం వహిస్తున్న ప్రచండ ఇంటికి వెళ్లి.. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించారు. ఆయన వెనక్కి తగ్గకపోవడంతో పార్లమెంట్ రద్దు చేయాలని నిర్ణయించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి