భార్గవ్‌ రామ్.. బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో కీలక సూత్రధారి.. ఈ కేసులో హైదరాబాద్‌ పోలీసులుఏపీ మాజీ మంత్రి అఖిలప్రియే ప్రధాన నిందితురాలు అని ఇప్పటికే తేల్చారు. కానీ.. ఈ కిడ్నాప్‌లో భార్గవ్‌ రామ్‌ కూడా కీలక పాత్ర పోషించాడు.. అఖిల ప్రియ ప్లాన్‌ను పక్కాగా అమలు చేయించింది ఇతగాడే. బోయినపల్లి కిడ్నాప్ ఘటనలో గుట్టు రట్టయిన తర్వాత నుంచి భార్గవ్‌రామ్ పత్తా లేకుండా పోయాడు.

ఇంత టెక్నాలజీ ఉన్నా పరారీలో ఉన్న భార్గవ్‌రామ్‌ను పోలీసులు ఇప్పటివరకూ పట్టుకోలేకపోతున్నారు. అయితే పరారీలో ఉన్న భార్గవ్‌రామ్‌ మాత్రం.. భలే తెలివితేటలు చూపిస్తున్నాడు. పరారీలో ఉంటూనే తన లాయర్‌తో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేయించాడు. ఈ బెయిల్ పిటీషన్‌పై సికింద్రాబాద్ కోర్టు తీర్పు ఇంకా చెప్పలేదు. ముందుస్తుగా బెయిల్ మంజూరైతే భార్గవ్ రామ్ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.

కిడ్నాప్ ఘటన జరిగిన తర్వాత రోజే అఖిలప్రియ గుట్టు రట్టయినా.. భార్గవ్‌ రామ్ మాత్రం ఇంకా దొరకనేలేదు. కేసు చిక్కుముడి వీడినట్టే అనిపిస్తున్నా.. అసలు కిడ్నాప్‌లో కీలక పాత్ర పోషించినట్టు చెబుతున్న  అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌ను మాత్రం ఇంకా పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. విచిత్రం ఏంటంటే.. మొదట్లో భార్గవ్‌రామ్‌ పోలీసులకు చిక్కినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ.. ఇప్పటి వరకూ అతడిని పట్టుకున్నట్టు పోలీసులు ప్రకటించలేదు.

భార్గవ్‌ రామ్ ఇంకా పోలీసుల చేతికి చిక్కపోయినా.. అతని ఆచూకీ తెలిసింది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతని కీలక అనుచరుడు శ్రీను కర్ణాటకలో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. వారు చెబుతున్న ప్రకారం ఆ కిడ్నాప్‌ పథకం మొత్తం భార్గవ్‌ రామ్ దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేశాడట. కిడ్నాప్‌ పూర్తయిన తర్వాత తర్వాత భార్గవ్ రామ్ కిడ్నాపర్లకు చెప్పినట్టుగా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ చేరుకున్నాడట. అక్కడే  ప్రవీణ్‌, నవీన్ లతో భార్గవ్‌రామ్‌ సంతకాలు చేయించారని పోలీసులు తెలిపారు. ప్రవీణ్ రావు, నవీన్‌ తో సంతకాలు తీసుకున్న తర్వాత.. భార్గవ్‌ రామ్‌, మాదాల శీను ఇద్దరూ తెలంగాణ విడిచిపోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: