
ఎంఐఎం కేవలం హైదరాబాద్ పార్టీగానే ఉండేది. అలాంటిది ఆ పార్టీ కొంత కాలంగా ఇతర రాష్ట్రాల్లో కూడా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడ ఎన్నికలు జరిగాని బరిలో ఉంటోంది. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అడుగు పెట్టిన ఎంఐఎం.. అదే రాష్ట్రంలోని ఔరంగాబాద్ లోక్‌సభ సీటును కూడా గెలుచుకుని పార్లమెంటులో రెండో స్థానం సాధించింది. ఇక ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఏకంగా ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని సంచలనం నమోదు చేసింది. ఇక లౌకిక పార్టీల ఓట్లు చీల్చి పరోక్షంగా ఆ పార్టీ బీజేపీ గెలుపునకు సహకరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా బీజేపీకే చెందిన ఎంపీ సాక్షి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీకి ఎంఐఎం సాయం చేసిందని, భవిష్యత్తులోనూ ఓవైసీ సహాయం ఉంటుందని అన్నారు. త్వరలో జరిగే ఉత్తర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికలతో పాటు బెంగాల్, ఇతరత్రా ఎన్నికల్లోనూ తాము మజ్లిస్‌కు సాయం చేస్తామని ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బిహార్ ఎన్నికల తర్వాత ఎంఐఎం బీజేపీకి బీ టీంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు సాక్షి మహరాజ్ వ్యాఖ్యలు సైతం ఇందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి.