2019 నాటికి తెలంగాణ శాసనసభను శాసించే స్థాయికి వైకాపా చేరుకుంటుందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డుసభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జిల్లాలో తిరుగులేని శక్తిగా వైకాపా అవతరించే స్థితికి చేరుకొని ఒక పార్లమెంట్ స్థానాన్ని, మూడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నప్పటికి ప్రలోభాలతో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులను అధికార పార్టీ లోబర్చుకుందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు భద్రాచలం, బూర్గంపాడు ప్రాంతాల స్థానిక ప్రజాప్రతినిధులు తమ పదవులకు ప్రమాణం చేసే స్థితి లేకపోవడం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీచేస్తూ వైకాపా తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలను అధికార పార్టీ చేయడం నీతిమాలిన చర్యని అభివర్ణించారు. ప్రజాప్రతినిధులకు ఎంత సంపాదించామన్నది ముఖ్యంకాదని ప్రజలకు సుపరిపాలన నీతివంతంగా అందించామనే ముఖ్యమని పేర్కొన్నారు.

పదవులు శాశ్వతంకాదని, ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచే అభివృద్ధి పనులను నిర్వహించాలని సూచించారు. మభ్యపెడుతున్న ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పేరోజులు సమీపించాయని అన్నారు. ప్రజల పక్షాన ప్రజాప్రతినిధులు నిలబడితే ఆశించిన ఫలితాలు రాబట్టొచ్చని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 542పార్లమెంట్ సభ్యులలో ఖమ్మం ఎంపినైన తాను అభివృద్ధి పనులు, ఎంపి నిధుల వినియోగంలో మొదటిస్థానంలో ఉండడం ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తున్నాననడానికి నిదర్శనమన్నారు. రానున్న కాలంలో పార్టీ కార్యకర్తలు తలెత్తుకునే అభివృద్ధిని సాధిస్తానని, తెలంగాణ రైతుల ఇబ్బందులను పార్లమెంట్‌లో వినిపించి వారికి న్యాయం చేసేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈసమావేశంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, రాష్ట్ర, జిల్లా నాయకులు కొదమసింహం పాండురంగాచార్యులు, ఆకుల మూర్తి, జెవిఎస్ చౌదరి, భీమా శ్రీ్ధర్, సాధు రమేష్‌రెడ్డి, నర్సిరెడ్డి, బి రాజశేఖర్, డాక్టర్ రవిబాబునాయక్, జాలె జానకిరెడ్డి, ముత్తయ్య, గుగులోత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: