బీహార్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో కరోనా కలకలం రేకెత్తించింది. ఎయిమ్స్‌లోని 384 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అక్కడి ఉద్యోగులు ఆందోళనకు లోన‌వుతున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలినవారిలో వైద్యులతోపాటు నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఎయిమ్స్ లోనే కాకుండా ఇత‌ర ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో కూడా పెద్ద సంఖ్యలో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది కరోనా బారిన ప‌డుతుండ‌టంతో బీహార్‌లో ఆరోగ్య సేవల పరిస్థితి దయనీయంగా తయారైంది.

పెరుగుతున్న పాజిటివ్ కేసులు
బీహార్‌లో కొన్నిరోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో సెకండ్‌ వేవ్‌ కేసులు భారీసంఖ్య‌లో  నమోదవుతున్నాయి. కొవిడ్ రోగుల‌తో అన్ని జిల్లా కేంద్రాలతోపాటు రాజధాని పాట్నాలోని దవాఖానల్లోని బెడ్లు అన్నీ నిండిపోయాయి. ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌కు డిమాండ్ ఏర్పడింది. మంగళవారం వరకు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవ‌డంతోపాటు రోగులను తీసుకుని ఆసుప‌త్రుల‌కు వ‌చ్చేవారు ఎలాంటి ముంద‌స్తు జాగ్ర‌త్త చర్యలు తీసుకోకుండానే  వస్తుండటంతో ఇక్కడి ఆసుప‌త్రుల్లోని సిబ్బంది కరోనా బారిన ప‌డుతున్నారు.

ఆందోళ‌న‌క‌రంగా ప‌రిస్థితి
ఎయిమ్స్‌లో పనిచేస్తున్న దాదాపు 384 మందికి బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్ర‌భుత్వం ఆందోళ‌న‌కు లోన‌వుతోంది.  వైద్యం అందించేందుకు వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. రాజధానిలోని ఆసుప‌త్రుల్లో  90 శాతం వైద్యులు, సిబ్బందికి వైర‌స్ సోకింది. అదేవిధంగా పీఎంసీహెచ్‌లోని ప్రిన్సిపాల్‌తోపాటు 30 మంది వైద్యులు, 49 మంది ఇతర సిబ్బందిని కూడా ఈ మ‌హమ్మారి వ‌ద‌ల్లేదు. ఎన్‌ఎంసీహెచ్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఇక్కడ 40 మందికి పైగా సిబ్బందికి కరోనా వైరస్‌ లక్షణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ముఖ్య‌మంత్రి నితీష్‌కుమార్ ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. దేశంలో క‌రోనా విజృంభిస్తుండ‌టంతో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. న‌మోదువుతున్న ఎక్కువ కేసుల్లో మ‌హారాష్ట్ర‌, బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుంచే వ‌స్తుండ‌టంపై ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. స‌త్వ‌ర‌మే వైర‌స్ క‌ట్ట‌డికి అన్ని రాష్ట్రాలు చ‌ర్య‌లు చేపట్టాల‌ని కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: