గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతానికి చెందిన ఓ యువ‌కుడు ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వ‌డానికి అమెరికా వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డ్డాడు. ప‌ది సంవ‌త్స‌రాల‌ క్రిత‌మే తండ్రి మ‌ర‌ణించారు. ఇంటి ద‌గ్గ‌ర అమ్మ‌, అమ్మ‌మ్మ ఉంటారు. త‌ల్లికి తాజాగా క‌రోనా సోకింది. అమెరికా  నుంచి రావ‌డానికి ప్ర‌యాణ ఆంక్ష‌లు ఉండ‌టంతో రాలేక‌పోయాడు. యోగ‌క్షేమాలు చూడ‌లేని స్థితి. అమ్మ‌ను ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అయినా భ‌గ‌వంతుడు క‌రుణించ‌లేదు. చికిత్స పొందుతూ తొమ్మిది రోజుల‌కే ఆ త‌ల్లి మృతిచెందింది. స్నేహితుడి ఫోన్ నుంచి వీడియోకాల్ ద్వారా అమ్మ‌ను క‌డ‌సారిగా చూసి వెక్కివెక్కి ఏడ్చాడు. ఓ ట్ర‌స్టుద్వారా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

ఆందోళ‌న చెందుతున్న ఎన్నారైలు!
విదేశాల్లో ఉంటున్న‌వారు త‌మ త‌ల్లిదండ్రుల క్షేమ స‌మాచారాల‌పై ఆందోళ‌న చెందుతున్నారు. వారి ఆరోగ్య ప‌రిస్థితుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఫోన్‌చేసి స‌మాచారం తెలుసుకుంటున్నారు. క‌రోనా సోకిన త‌ల్లిదండ్రుల‌ను స్నేహ‌తులు, బంధువుల స‌హ‌కారంతో ఆసుప‌త్రిలో చేర్పిస్తున్నారు. వైర‌స్‌తో విల‌విల్లాడిపోతున్న స‌మ‌యంలో అయిన‌వారు అందుబాటులో లేని కొర‌త   త‌ల్లిదండ్రుల‌ను తీవ్రంగా వేధిస్తోంది. ఒక‌వేళ ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణిస్తే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హ‌ణ‌కు విదేశాల నుంచి రాలేని దుస్థితి నెల‌కొంది. అల్లారుముద్దుగా పెంచిన‌వారు దూర‌మైతే క‌నీసం ద‌గ్గ‌ర లేక‌పోయామ‌ని ఎన్నారైలు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం కొన్ని దేశాల నుంచి విమాన రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు ఉండ‌టంతో అక్క‌డ నుంచి చాలామంది రాలేక‌పోతున్నారు. ఫోన్‌లోనే క‌డ‌సారి చూపులు చూసి కుమిలిపోతున్నారు.

అయిన‌వారికి అంతిమ సంస్కారాలు చేయ‌లేక‌..
అయిన‌వారు వైర‌స్ బారిన ప‌డి మ‌ర‌ణిస్తే అంతిమ సంస్కారాలు చేయ‌లేక‌పోతున్నారు. ఉపాధి, వృత్తి రీత్యా విదేశాల‌కు వెళ్లిన‌వారు మ‌రింత ఆవేద‌న‌కు గుర‌వుతున్నారు. క‌ని పెంచిన త‌ల్లిదండ్రులు దూర‌మైతే అంత్య‌క్రియ‌ల నిర్వ‌హ‌ణ‌కు అక్క‌డ నుంచి రాలేని నిస్స‌హాయ స్థితి. వీడియో కాల్ ద్వారా చివ‌రి చూపు చూసి క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. క‌నీసం క‌న్న‌వారి చితికి త‌ల‌కొరివి పెట్ట‌లేని దుస్థితి తెచ్చావా?  దేవుడా? అంటూ త‌ల్ల‌డిల్లిపోతున్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లోను ఇటువంటి ప‌రిస్థితులు నెల‌కొన‌డం అంద‌రినీ ఆవేద‌న‌కు గురిచేస్తోంది. క‌రోనా బాధితుల‌కు చేయూత‌నందించ‌డానికి ఇప్పుడిప్పుడే అంద‌రూ ముందుకు వ‌స్తుండ‌టంతో బాధితుల‌కు కొంత స్వాంత‌న ల‌భిస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: