హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి చుక్కలు కనపడేలా ఉన్నాయి. ఓవైపు సంక్షేమ కార్యక్రమాల అమలుతో దూసుకుపోతున్నా, మరోవైపు స్థానికంగా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తిప్పలు కొనితెచ్చేలా ఉన్నాయి. ఇటీవలే గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులను ప్రభుత్వం తొలగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 7,600మంది ఉపాధి కోల్పోయారని, వారిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు బీసీ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య. లేకపోతే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి పరాభవం తప్పదని, హుజూరాబాద్ లో వెయ్యి మందితో ఫీల్డ్ అసిస్టెంట్లతో నామినేషన్లు వేయిస్తామని హెచ్చరించారు.

హుజూరాబాద్ మరో నిజామాబాద్ అవుతుందా..?
గతంలో నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎంపీగా బరిలో దిగిన కేసీఆర్ కుమార్తె కవిత.. పసుపు రైతుల ధాటికి పరాజయం పాలయ్యారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 185మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో 178మంది రైతులు కవిత ఓటమికోసమే నామినేషన్ వేయడం గమనార్హం. పసుపు బోర్డు ఏర్పాటు చేయలేకపోయారని, గిట్టుబాటు ధర కల్పించకుండా పసుపు రైతుల్ని నిండా ముంచేశారనేది అప్పట్లో వారి ఆరోపణ. అయితే రైతులు పెద్దగా ఓట్లును చీల్చలేకపోయారు కానీ.. పరోక్షంగా అది బీజేపీ అభ్యర్థి అరవింద్ కి కలిసొచ్చింది. సిట్టింగ్ ఎంపీగా ఉండి కూడా, సీఎం కుమార్తె అయి కూడా అక్కడ కవిత గెలవలేకపోయారు.

అదే సెంటిమెంట్ కొనసాగుతుందా..?
ప్రస్తుతానికి హుజురాబాద్ లో ఏ పార్టీ కూడా తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. అసలు ఈటల రాజేందర్ కూడా పోటీలో ఉంటారో లేరో తెలియని పరిస్థితి. ఈ దశలో టీఆర్ఎస్ కూడా వేచి చూసే ధోరణిలో ఉంది. ప్రస్తుతానికి కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నా ఆయనకు అభ్యర్థిత్వం ఖరారైనట్టు సమాచారం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రభావం ఎన్నికలపై ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. నిజామాబాద్ సెంటిమెంట్ కొనసాగితే మాత్రం టీఆర్ఎస్ కి కష్టమే. ఉద్యోగాలు కోల్పోయిన ఫీల్డ్ అసిస్టెంట్ లు భారీ సంఖ్యలో బరిలో దిగితే, ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనే విషయం జనాల్లోకి వెళ్తుంది. కచ్చితంగా అది టీఆర్ఎస్ అభ్యర్థికి మైనస్ గా మారుతుంది. అయితే ఈలోపే కేసీఆర్ అసంతృప్తులను బుజ్జగిస్తారనడంలో సందేహం లేదు. ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ, రాష్ట్రంలోని వివిధ వర్గాలకు తాయిలాలు ప్రకటిస్తూ వస్తున్న కేసీఆర్ కి ఇలాంటి సమస్యను పరిష్కరించడం చిటికెలో పని.


మరింత సమాచారం తెలుసుకోండి: