కరోనా.. ఇప్పుడు మానవాళి పాలిట ఇది మహమ్మారి.. ఇది వస్తే ప్రాణాలకు గ్యారంటీ లేదు. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా.. దీని ప్రభావం మాత్రం ఆరోగ్యంపై చాలా ఎక్కువగానే ఉంటోంది. కరోనా వచ్చి తగ్గిన వారిని అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనంలో అనేక విభ్రాంతికర వాస్తవాలు వెలుగు చూశాయి. కరోనాతో ఊబకాయుల్లో ముప్పు ఏడింతలు అధికం అవుతుందట. మధుమేహుల్లో మూడింతలు, అధిక రక్తపోటు బాధితుల్లో రెండున్నర రెట్లు ప్రభావం చూపుతుందట.


కరోనా బారిన పడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో అప్రమత్తత అవసరమని లేకుంటే.. ప్రాణాలకే ప్రమాదమని ఈ  అధ్యయనం చెబుతోంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండెజబ్బు, పక్షవాతం వంటి వ్యాధులున్న వారిపై కొవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోందట. మామూలు కొవిడ్‌ రోగుల కంటే దీర్ఘకాలికంగా ఈ వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా ముప్పు చాలా ఎక్కువ అని చెబుతున్నారు. కరోనా - జీవనశైలి వ్యాధులు  అనే అంశంపై ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి.


ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పరిశోధనలు అన్నింటినీ పరిశీలించి ఓ అవగాహనకు వచ్చింది. ఆ తాజా అధ్యయనాన్ని ప్రజల కోసం విడుదల చేసింది. దీంట్లో తేలిందేమంటే జీవనశైలి వ్యాధిగ్రస్తులకే కొవిడ్‌ ఎక్కువ సోకుతుందనడానికి స్పష్టమైన ఆధారాలేమీ లేవట. అయినా.. వారు వైరస్‌ బారినపడితే మాత్రం కొందరిలో వ్యాధి తీవ్రరూపం దాలుస్తోందట. వారిలో కొందరు ఐసీయూలో చికిత్స పొందాల్సి వస్తోందట. ఇంకొందరైతే ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోందట.


అంతే కాదు.. ఈ దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారిని టీకాలు కూడా పూర్తిగా కాపాడటం లేదట. వీరిలో కొందరికి  రెండు డోసుల టీకా పొందినా కూడా యాంటీబాడీలు వృద్ధి చెందలేదట. అందుకే టీకా పొందాం కదా.. అని దీమా వద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇలాంటి వారు తప్పనిసరిగా ఎప్పటిలాగే మాస్కు ధరించాలట. గుంపుల్లోకి వెళ్లకపోవడమే మంచిదట. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.


మరింత సమాచారం తెలుసుకోండి: