ఐపీఎస్ అధికారి సజ్జనార్ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. నేరస్థులకు సింహస్వప్నంలా కనిపించారు. అలాంటి సజ్జనార్ ఆర్టీసీ ఎండీ అయ్యాక.. ఆ పదవిలో ఉంటూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు రోడ్డు మధ్యలో బస్సు ఆపడం ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఇక నుంచి రోడ్డు మధ్యలో బస్సు ఆపినప్పుడు ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానా బస్సు డ్రైవర్ చెల్లించాలన్నారు. క్రమశిక్షణా చర్యలూ ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. బస్సులు రోడ్డు మధ్యలో ఆపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

 ఇటీవలే ప్రయాణీకుల కష్టాలు తెలుసుకునేందుకు.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. వారి సమస్యలను ఓపిగ్గా అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఇకపై ఆర్టీసీ బస్సుల మీద అశ్లీల పోస్టర్లు అంటించరాదని తేల్చి చెప్పారు. అందులో భాగంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఆర్టీసీ బస్సులపై అభ్యంతరకరంగా ఉండే పోస్టర్లను వెంటనే తీసివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఆర్టీసీ బస్సులపై ఉన్న అభ్యంతరకర పోస్టర్లపై.. అభిరామ్ అనే వ్యక్తి సజ్జనార్ కు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి స్పందించిన సజ్జనార్ వెంటనే స్పందించి చర్యలు ప్రారంభించారు. అలాంటి పోస్టర్లను ఆర్టీసీ బస్సులపై లేకుండా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు ఆర్టీసీలో పలు సంస్కరణలు తీసుకొచ్చేందుకు పూనుకున్నారు. రవాణా సౌకర్యం లేని చోట బస్సులను నడపడం.. బస్సులను శుభ్రంగా ఉంచడం.. పాత బస్సులను రోడ్లపై లేకుండా చేయడం.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు.

అంతేకాదు కరోనా వల్ల ఆర్టీసీ ఆర్థికంగా దెబ్బతినింది. అలాంటి సంస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించారు సజ్జనార్. పెరుగుతున్న పెట్రో ధరలు సంస్థపై మోయలేని భారాన్ని మోపాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు సజ్జనార్ ప్లాన్ వేస్తున్నారు. కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సిద్ధమవుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: