ఏపీ సీఎం జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌డ‌తార‌నే వార్త బ‌య‌టకు రాగానే చాలా మంది నాయ‌కులు త‌మ‌కు అనుకూలంగా సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గం నుంచి ఒక‌రిద్ద‌రు నేత‌లు దూకుడుగా ఉన్నారు. మాకు ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఆళ్ల నాని, కుర‌సాల క‌న్న‌బాబు, పేర్నినాని వంటివారు.. కాపు సామాజిక వ‌ర్గం నుంచి మంత్రివ‌ర్గంలో ఉన్నారు. అయితే.. వీరి వ‌ల్ల  కాపులు.. పార్టీకి చేరువ అయింది ఏమీ క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు  ముందు ప‌రిస్థితి ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉంది. అంతేకాదు.. స్థానిక స‌మ‌రంలో.. కాపులు ఎక్కువ‌గా ఉన్న చోట‌.. జ‌న‌సేన అభ్య‌ర్థులు పుంజుకున్నారు.

అంటే.. కాపుల‌ను తీసుకున్నా.. ఈ సామాజిక వ‌ర్గం వైసీపీతో మిలాఖ‌త్ అయిన ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇక‌పై ఎవ‌రికి అవ‌కాశం ఇచ్చినా.. దూకుడుగా ఉండే నాయ‌కుల‌కు ఛాన్స్ ఇవ్వాలి. లేక‌పోతే.. కాపు సామాజిక వ‌ర్గంలో అసంతృప్తి అలానే ఉంటుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఎవ‌రికివారు భేరీజు వేసుకుంటున్నారు. ఇదిలావుంటే. గుంటూరుకు చెందిన స‌త్తెన ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని.. తాను వైఎస్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితంగా ఉంటున్నాన‌ని చెప్పుకొస్తున్నారు.

అంతేకాదు.. త‌న‌కు కాకుండా.. ఎవ‌రికి ప‌ద‌వి ఇస్తార‌ని అంటున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియాలోనూ ప్ర‌చారం చేసుకుంటున్నారు. మంచిదే.. ఎవ‌రి ఆశ‌లు వారికి ఉంటాయి. అయితే.. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని మార్పులు.. చేర్పులు చేస్తున్న స‌మ‌యంలో అంబ‌టి రాంబాబు ఏమేర‌కు కాపుల ను వైసీపీ వైపు మ‌ళ్లించ‌గ‌లుగు తారు ? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. పైగా కాపు ఉద్య‌మం తెర‌మీద‌కి వ‌చ్చిన‌ప్పుడు కూడా వారి త‌ర‌ఫున వాయిస్ వినిపించ‌లేదు.

ఇన్నాళ్లు గా కాపుల‌కు సంబంధించిన ఏ స‌మ‌స్య‌పైనా చ‌ర్చించింది కూడా లేదు. రాష్ట్ర ప్ర‌భుత్వం కాపుల కోసం అని వేసిన క‌మిటీకి ఆయ‌నే చైర్మ‌న్ అయిన‌ప్ప‌టికీ.. మ‌రి ఈ క‌మిటీ ఏం చేసిందో కూడా ఎవ‌రికీ తెలియదు. సో.. ఇలా చూసుకుంటే.. అంబ‌టికి సీటు ఇవ్వ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వానికి ఏమీ ప్ల‌స్ అయ్యే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదైనా ఉంటూ.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన వారికే మ‌ళ్లీ అవ‌కాశం ద‌క్కుతుంద‌ని చెబుతున్నారు.కానీ, అంబ‌టి మాత్రం త‌న ప్ర‌చారాన్ని జోరుగా సాగిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: