సీమ ప్రాంతాన్ని ఎన్న‌డూ లేని విధంగా విపత్తులు ప‌ల‌క‌రిస్తూనే ఉన్నాయి. ఉన్నంత‌లో ప్ర‌భుత్వం సాయం చేస్తున్నా న‌ష్ట ప‌రిహార పంపిణీ స‌మయంలో స్థానికుల నుంచి అధికార పార్టీకి ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌లు వ్య‌క్తం అవుతున్నాయి. వ‌ర‌ద సాయం పంపిణీలో కూడా అనేక అవ‌క‌త‌వ‌క‌లు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌లూ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు ఏం చేయాలో పాలుపోక నిర‌స‌న‌లను నియంత్రించ‌లేక నానా అవ‌స్థ‌లూ ప‌డుతున్నారు. మ‌రోవైపు తిరుప‌తి వ‌ర‌ద‌లకు ఓ విధంగా కార‌ణం చంద్ర‌బాబే అని చెవిరెడ్డి (ఎమ్మెల్యే) ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అనాలోచితంగా తిరుప‌తిలో చేప‌ట్టిన క‌ట్ట‌డాల కార‌ణంగానే ఈ దుఃస్థితి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా ఇప్ప‌టికిప్పుడు సీమ వాసుల‌కు త‌లెత్తిన ఇబ్బంది నుంచి గ‌ట్టెక్కించే నాయ‌కుడు కావాలి. కానీ ఆ విధంగా రాజ‌కీయం అయితే లేదు. విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌లు త‌ప్ప ఇప్ప‌టికిప్పుడు స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి లేదు. రాయ‌ల చెరువు కు సంబంధించి కొన్ని ప‌నులు చేప‌ట్టామ‌ని దీంతో గండిని అరిక‌ట్టామ‌ని చెవిరెడ్డి చెబుతున్నా రేప‌టి వేళ వ‌ర‌ద ఉద్ధృతికి ఏమౌతుందో అన్న ఆందోళ‌న‌లు నెల‌కొని ఉన్నాయి. రానున్న మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ చెబుతున్నందున ఏ క్ష‌ణాన ఏమౌతుందోన‌ని హ‌డ‌లి పోతున్న సీమ‌వాసుల‌కు నేత‌ల నుంచి అందుతున్న స‌హ‌కారం అంతంత మాత్ర‌మే కావ‌డం విచార‌కరం.

ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో...
వాన‌లు, వ‌ర‌ద‌లు ఆ నాలుగు జిల్లాల‌నూ అత‌లాకుతలం చేస్తున్నాయి. రాయ‌ల‌సీమ‌లో క‌ర్నూలు మిన‌హా చిత్తూరు, అనంత‌పు రం, క‌డ‌ప‌తో పాటు నెల్లూరు కూడా జ‌ల ప్ర‌ళ‌యంతో విల‌విల‌లాడుతోంది. వాన‌ల‌కూ వ‌ర‌ద‌ల‌కూ ఇళ్లు కోల్పోయి నిరాశ్ర‌యుల‌యిన వారంతా త‌మ‌ను ఆదుకోమ‌ని నాయ‌కుల‌ను వేడుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీ నాయ‌కుల‌ను ఎక్క‌డిక్క‌డ అడ్డుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి కుమారుడు ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నిన్న‌టి వేళ అడ్డుకున్నారు. తిరుప‌తి రూర‌ల్ మండ‌లం, పాత కాల్వ గ్రామ‌స్థుల నుంచి ఆయ‌నకు నిర‌సన సెగ ఎదురయింది. త‌మ‌పై న‌మోదు చేసిన కేసులు వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని వీరంతా కోరారు. ఇటీవ‌ల వ‌ర‌ద‌ల‌కు పేరూరు చెరువుకు గండి కొట్టొద్ద‌ని తాము విన్నవించుకు న్నా మీరు మా మాట విన‌కుండా గండి కొట్టార‌ని, ఇదేమ‌ని అడిగితే మాపై కేసులు బ‌నాయించార‌ని ఆవేద‌న చెందుతూ నీట మునిగిన గ్రామాన్ని ఇప్పుడెందుకు సంద‌ర్శిస్తార‌ని నిల‌దీస్తూ గ్రామ‌స్థులు రోడ్డెక్కారు. దీంతో ఎంపీపీ చేసేది లేక చాలా సేపు పోలీసుల ర‌క్ష‌ణ‌లోనే ఉండిపోయారు. ఆఖ‌రికి గ్రామ‌స్థుల‌కు క్షమాప‌ణ‌లు చెప్పి వెనుదిరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: