ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య చివ‌రి రోజుల్లో ఎక్క‌డ గ‌డిపారు.. మ‌ర‌ణానికి ముందు ఇటీవ‌ల ఏయే కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.. చివ‌ర‌గా ఎవ‌రిని క‌లిశారు.. అనే వివ‌రాలు తెలుసుకోవాల‌ని రోశ‌య్య‌ అభిమానులు ఆస‌క్తితో ఉన్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన కొణిజేటి రోశ‌య్య గుంటూరు జిల్లా వేమూరులో జ‌న్మించారు. 1968 నుంచి 2010 సంవ‌త్స‌రం వ‌ర‌కు వివిధ హోదాల్లో ప‌నిచేశారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ హోదాలు నిర్వ‌హించారు. మ‌ర్రి చెన్నారెడ్డి, నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్‌రెడ్డి, కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాంలో మంత్రి ప‌ద‌వులు నిర్వ‌హించారు.

వాళ్లు ముఖ్య‌మంత్రుల హోదాలో నంబ‌ర్ 1గా ఉన్నా.. ప్ర‌తీసారి రోశ‌య్యే నంబ‌ర్ 2గా ఉండేవారు. ఆర్థిక మంత్రి హోదాలో 15 సార్లు రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఇందులో వ‌రుస‌గా 7 సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఘ‌న‌త‌ను ద‌క్కించుకున్నారు. ఈ స్థాయి ఘ‌న‌త దేశంలో మ‌రెవ‌రికీ లేద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. రోశ‌య్య త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నో ఎత్తులు చూశారు. ఎంద‌రికో విధేయుడిగా నిలిచారు. త‌ల‌పండిన నేత‌లు కూడా రోశ‌య్య‌కు త‌ల‌వంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సంద‌ర్భంలో ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కుర్చీపై క‌న్నేశారు. దీంతో కాంగ్రెస్‌లో వ‌ర్గ విభేదాలు మొద‌ల‌య్యాయి.

అప్ప‌డు కూడా అధిష్ఠానం ఆర్థిక మంత్రిగా ఉన్న రోశ‌య్య వైపే చూసింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించింది. సీఎల్పీ భేటీ లేకుండానే కేవ‌లం అధిష్ఠానం ప్ర‌క‌ట‌న‌తోనే ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యారు. దీంతో రోశ‌య్య త‌న‌దైన శైలిలో అసంతృప్తుల‌ను శాంత‌ప‌రిచారు. రోశ‌య్య ఆర్థిక మంత్రిగా ఎన్నో సార్లు రాష్ట్రాన్ని అప్పుల గండం నుంచి బ‌య‌ట‌ప‌డేశారు. కానీ, ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న కొద్ది స‌మ‌యంలో మొద‌లైన ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ గొడ‌వ‌ను ప‌రిష్క‌రించ‌లేక‌పోయారు. ఆయ‌న మెత‌క వైఖ‌రి వ‌ల్లే స‌మ‌స్య తీవ్ర‌మైంద‌ని ఇప్ప‌టికీ కొంద‌రు చ‌ర్చించుకుంటారు. కానీ రోశ‌య్య వివాదాల జోలికి పోకుండా అధిష్ఠానానికి న‌మ్మిన బంటుగా ప‌నిచేశారు. పార్టీకి ఆయ‌న సేవల‌ను గుర్తించిన కాంగ్రెస్ చివ‌ర్లో త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించారు.

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా ఆరు సంవ‌త్స‌రాలు దిగ్విజ‌యంగా పూర్తి చేసుకున్న రోశ‌య్య అప్ప‌టి నుంచి హైద‌రాబాద్ అమీర్‌పేట‌లోని త‌న నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. 2018లో వెంక‌య్య‌నాయుడు రోశ‌య్య‌కు జీవ‌న సాఫ‌ల్య పుర‌స్కారం అందించారు. ఆ త‌ర్వాత ఇటీవ‌ల రేవంత్‌రెడ్డి క‌లుసుకోవ‌డ‌మే చివ‌రిదిగా తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత వ‌రుస‌గా కాంగ్రెస్ పెద్ద‌ల‌ను క‌లుస్తూ వ‌చ్చారు. అందులో భాగంగానే రోశ‌య్య‌ను కూడా ఆయ‌న నివాసంలో క‌లిసి ఆశీర్వాదం తీసుకున్నారు. రోశ‌య్య రేవంత్ భుజం త‌ట్టి గోఅహెడ్ అన్నారు. ఆ సంఘ‌ట‌న‌ను గుర్తు చేసుకొని రేవంత్‌రెడ్డి విచారం వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: