తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి థ‌ర్డ్ ఫ్రంట్ వైపు అడుగులు వేస్తున్న‌ట్టు సంకేతాలు క‌నిపిస్తున్నాయి. దీంతో ఎన్నిక‌ల వ్యూహ క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కేసీఆర్ వెనుక ఉన్నారా..? పీకే, కేసీఆర్ క‌లిసి ప‌ని చేస్తారా అన్న ప్ర‌శ్న‌లు వ్యక్తం అవుతున్నాయి. పీకే అంటే తెలియ‌ని వారే ఉండ‌రు.. ప్ర‌శాంత్ కిషోర్ ఎన్నిక‌ల వ్యూహ ర‌చ‌న‌లో అప‌ర చాణ‌క్య‌డు. మోడీ చాయ్‌వాలా కాన్సెప్ట్ ను తెర‌పైకి తీసుకువ‌చ్చాడు. ట్రెండ్ సెట్ చేస్తూ అధికారంలోకి రాలేని పార్టీల‌ను కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే స‌మ‌ర్థుడు. ల‌గెరెహో కేజ్రీవాల్ అంటూ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపులో కీల‌క భూమిక పోషించాడు. మొన్న‌టికి బీజేపీ అగ్ర‌నాయ‌కుల‌ను మ‌ట్టి క‌రిపించి బెంగాల్‌లో దీది అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించాడు. 2019లో ఏపీలో వైసీపీ అధికార పీఠం ఎక్కేలా చేశాడు పీకే.


 ఎన్నో పార్టీల‌కు, నేత‌ల‌కు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న ప్ర‌శాంత్ కిషోర్ అడుగు పెడితే విజ‌యం వ‌రిస్తుంద‌ని న‌మ్ముతుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన బాధ్య‌త‌లను పీకే పూర్తి చేసి వ్యూహ‌క‌ర్త‌గా స‌క్సెస్ త‌న వెనుక ఉంచుకున్నారు. అయితే, ఈసారి సీఎం కేసీఆర్ పీకే సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఎన్నిక‌ల పోరును మొద‌లు పెట్టిన కేసీఆర్‌.. ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ స్థాపించేందుకు పీకే  ను రంగంలోకి తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. అయితే, ఎవరి ఎన్ని వ్యూహాలు ర‌చించాల‌ని చూసినా కేసీఆర్‌కు త‌న సొంత స్ట్రాట‌జీలు ఉంటాయి.


  కానీ, అనూహ్యంగా తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డుతుండ‌డంతో పీకేను కేసీఆర్ రంగంలోకి దింప‌నున్నార‌ని తెలుస్తోంది. గ‌తంలో బీజేపీ, కాంగ్రెస్ ఏత‌ర పార్టీలతో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్ర‌య‌త్నించారు. కానీ, అది స‌ఫ‌లం కాలేదు. దీంతో ఇప్పుడు మ‌రోసారి థ‌ర్డ్ ఫ్రంట్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు పీకేను భాగం చేయాల‌నుకుంటున్నార‌ట‌. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఫిబ్ర‌వ‌రి నుంచి పీకే టీమ్‌ను రంగంలోకి దింపుతార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల బాధ్య‌త‌లు పీకేకు అప్ప‌గిస్తార‌నే వార్త‌లు వస్తున్న నేప‌థ్యంలో గులాబీ నేత‌లు జాగ్ర‌త్త పడుతున్నార‌ని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: