భారత దేశ వ్యాపార రంగంలో ఇవాళ ఓ కీలకమైన రోజు.. ఎందుకంటే.. ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు ఇవాళ కేంద్రం అప్పగించబోతోంది. అంటే దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా గ్రూప్‌ చేతికి ఎయిరిండియా వెళ్లబోతోంది. ఇప్పటికే కేంద్రం ఎయిరిండియాలో వంద శాతం వాటా విక్రయించింది. రూ.18 వేల కోట్లకు ఎయిరిండియాను టాటా గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ విక్రయ ఒప్పందానికి గతేడాది అక్టోబర్‌ 8న కేంద్రం ఆమోదం తెలిపింది.  ఇలా టాటాలకు ఎయిర్‌ ఇండియాను అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.


మరి ఈ ఒప్పందానికి అంత ప్రత్యేకత ఏముంది.. ఇది బిగ్‌ డే ఎలా అవుతుందో తెలుసుకోవాలంటే.. ఒక్కసారి ఎయిర్ ఇండియా ప్రత్యేకత తెలుసుకోవాలి.. దాదాపు 90ఏళ్లక్రితం 1932లో జేఆర్‌డీ టాటా... ఈ టాటాఎయిర్‌ సర్వీసెస్‌ ప్రారంభించారు. అంటే బ్రిటీష్ వారి కాలంలోనే.. వారికి దీటుగా వచ్చిన ప్రైవేటు సర్వీస్ ఇది అన్నమాట. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1953లో జాతీయకరణ జరిగింది. దేశంలోని ప్రధాన సర్వీసులను భారత ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పుడే టాటా ఎయర్ సర్వీసెస్‌ కాస్తా.. ఎయిరిండియాగా మారింది. అలా టాటాల స్వప్నం దేశంపరమైంది.


1991లో ప్రపంచీకరణ తర్వాత విమానయాన రంగంలోకి కూడా ప్రైవేటు సంస్థలు వచ్చాయి. అప్పటి నుంచి ఎయిరిండియా క్రమంగా ప్రాభవం కోల్పోవటం మొదలైంది. ఎయిర్ ఇండియాకు నష్టాలు రావడం మొదలైంది. ఆ తర్వాత ఎయిర్ ఇండియాను 2007-08లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌తో విలీనం చేశారు. ఆ తర్వాత ఎయిర్ ఇండియా మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది.


ఇక ఎయిరిండియా కోలుకునే అవకాశాలు లేవని గ్రహించిన కేంద్రం చివరకు దాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న టాటాలు.. తమ తాతలు ప్రారంభించిన సంస్థను మళ్లీ సొంతం చేసుకున్నారు. వేలంలో పాల్గొన్న టాటా అనుబంధ సంస్థ టాలెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 18వేల కోట్లకు బిడ్డింగ్‌ వేసి ఎయిరిండియాను దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: