ఏపీలో జగన్ అధికారం లోకి వచ్చాక తీసుకొచ్చిన ప్రతిష్ఠాత్మక పథకాలలో అమ్మఒడి పథకం కూడా ఒకటి. ఈ పథకం కింద ఏటా విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.15000 జమ చేస్తున్నారు వై ఎస్ జగన్. ఇప్పటికే రెండు దపాలుగా ఈ పథకం కింద అర్హులకు డబ్బులు అందాయి. కాగా పాఠశాలల అభివృద్ధి పేరిట ఇప్పటికే అందులో నుండి రూ. 1000 లు కోత విధించారు. అయితే ఈ విషయం పక్కనే పెడితే..ఈ సారి చాలా మంది తల్లులకు పలు కారణాల వలన ఈ పథకం అందేలా లేదని తెలుస్తోంది. గతంలో కూడా హాజరు సరిగా లేకపోవడం, అందించాల్సిన పత్రాలలో పొరపాట్లు పలు కారణాల వలన చాలా మంది తల్లులకు ఈ పథకం అందలేదు. అయితే ఈ సారి కూడా చాలా మంది ఎలిజిబుల్ లిస్ట్ లో వారి పేర్లు లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ఇప్పటికే లక్షల మంది విద్యార్థులు అర్హుల లిస్ట్ లో లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి అనర్హుల వారి సంఖ్య డబుల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎక్కువ మంది విద్యార్థులకు నియమిత హాజరు లేకపోవడమే కారణమని తెలుస్తోంది. అయితే కరోనా కారణంగా , పరీక్షల కారణంగా ఎక్కువ మంది విద్యార్థులు అర్హుల లిస్ట్ లో లేరని తెలుస్తోంది. 75 శాతం హాజరు ఉండే విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంతో తల్లితండ్రులు బాధపడుతున్నారు . అయితే పాఠశాలల ప్రారంభంలో కొన్ని నెలల పాటు రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించిన విషయం తెలిసిందే.

దీని వల్ల చాలా మంది నిర్దేశించిన హాజరు చాలక అమ్మఒడికి అర్హత కోల్పోతారని ఉపాధ్యాయ సంఘ నాయకులు ముందు నుంచీ చెబుతూనే ఉన్నప్పటికీ... నిబంధనలు సడలించాలని ప్రభుత్వాన్ని కోరినా ఎలాంటి చర్యలు జరగలేదు. అయితే ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అన్నది తెలియడం లేదు. మరి ఈసారి కూడా అనర్హుల జాబితా మరింత పెరిగే అవకాశం కనపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: