రాష్ట్రంలో ప్రతిపక్షాల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. ఆలూలేదు చూలులేదు..అన్న సామెతలో చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతు టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఖాయమన్నారు. అయితే ఈ మూడుపార్టీలు కలిస్తే  ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డే అవుతారని చెప్పారు. మూడుపార్టీలు కలవటం ఏమిటి ? మళ్ళీ జగనే సీఎం అవటం ఏమిటి ? అనేందుకు నారాయణ తనదైన లాజిక్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీపైన జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందట.





అందుకని బీజేపీతో పొత్తుప్రభావం టీడీపీ, జనసేన పైనపడి అవికూడా నష్టపోతాయట. ఇక్కడ విషయం ఏమిటంటే టీడీపీ, జనసేనతో బీజేపీని కలవనీయకుండా చేయాలన్నది నారాయణ ఉద్దేశ్యం. ఎందుకంటే బీజేపీ స్ధానంలో పై రెండుపార్టీలతో తాము పొత్తుపెట్టుకోవాలని చూస్తున్నారు. ఇంతకాలం చంద్రబాబునాయుడు తనఅవసరాల కోసం సీపీఐని వాడుకున్నారు. తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేసమయానికి బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని చేస్తున్న ప్రయత్నాలతో నారాయణ మండిపోతున్నారు.





ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కు వామపక్షాలతో కలవాలని లేదు. 2019 ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని ఉపయోగం లేకపోవటంతో అప్పటినుండి పవన్ వామపక్షాలను వదిలేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జనసేన, సీపీఐ అప్పుడప్పుడు కలుస్తుంటాయంతే. టీడీపీ, జనసేనతో పొత్తుపెట్టుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబు కానీ పవన్ కానీ సానుకూలంగా స్పందించలేదు. ఎందుకంటే చంద్రబాబుకు వామపక్షాలతో కన్నా బీజేపీతోనే అవసరాలు ఎక్కువగా ఉన్నాయి.





అందుకని జగన్ కు వ్యతిరేకంగా సీపీఐని వాడుకుని వదిలేస్తున్నారు. దాన్నే ఇపుడు నారాయణ తట్టుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీని కలుపుకోవటం పవన్ కు పెద్దగా ఇష్టమున్నట్లు అనిపించటంలేదు. అయితే చంద్రబాబు ఒత్తిడి కారణంగానే తమ రెండుపార్టీలతో కలవాలని పవన్ పదేపదే బీజేపీని కోరుతున్నట్లు సమాచారం. తాను బీజేపీ పొత్తునుండి బయటపడాలని ఎంత ప్రయత్నిస్తున్నా బయటపడలేకపోతున్నారు. ఫైనల్ గా టీడీపీ, జనసేనతో పొత్తుపెట్టుకునే విషయంలో  బీజేపీ నేతల్లో స్పష్టమైన చీలిక వచ్చేసింది.  మొత్తానికి పొత్తులపై చంద్రబాబు, పవన్, నారాయణ, బీజేపీ నేతల్లో ఎవరి హిడెన్ అజెండాలు వాళ్ళకున్నట్లున్నాయి. అందుకనే కలవకముందే కుమ్ములాడుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: