జైల్లో ఉన్న చంద్రబాబు హత్యకు కుట్ర పన్నుతున్నారని జగన్ సర్కారుపై లోకేశ్ ఇటీవల ఆరోపణలు చేస్తున్నారు. దోమలు ఎక్కువగా ఉన్నాయని జైల్లో ఎలాంటి సౌకర్యాలు లేవని అంటున్నారు. ఒక ఖైదీ ఈ మధ్యనే రాజమండ్రి జైల్లో దోమలు కుట్టడంతో చనిపోయాడని లోకేశ్ ఆరోపించారు. కావాలనే దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉంచుతూ ఆయన ఆరోగ్యం పాడవడానికి కారణమవుతున్నారని అన్నారు.


చంద్రబాబు నాయుడుని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాట్లాడుతూ.. చనిపోయిన ఖైదీ రాజమండ్రి జైలులోకి వచ్చే సరికే ఆయన డెంగీతో బాధపడుతున్నారని చెప్పారు. జైలుకు వచ్చిన తర్వాత కాదని  వివరణ ఇచ్చారు. డెంగీతో ఇబ్బంది పడిన వ్యక్తిని కాకినాడ హస్పిటల్ కు పంపామని చెప్పారు. అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయాడని చెప్పారు.


చంద్రబాబు ఉన్న జైలు బారక్ ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచామని దోమల మందు కూడా కొట్టించామని చెబుతున్నారు. అదే సమయంలో దోమల నెట్ కూడా అందించామని ఆయన భద్రతకు ఎలాంటి ఢోకా లేదని వివరిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కు కావాల్సిన అన్నిసౌకర్యాలు అందిస్తున్నామని చెప్పారు. అయితే చంద్రబాబుకు ఏదైనా జరిగితే అది ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందని అన్నారు.


చంద్రబాబు విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని లోకేశ్, టీడీపీ నేతలు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ను సరిగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వయసు దృష్ట్యా జైలు కాకుండా గృహ నిర్బంధం లో ఉంచడం సరైనదని అడుగుతున్నారు. కానీ చట్టం అందరికీ ఒకే విధంగా ఉంటుందని ఎవరికీ చుట్టం లాంటిది కాదని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ చంద్రబాబుకు ఏమీ జరిగినా తర్వాత జరగబోయే పరిణామాలు వేరేలా ఉంటాయని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. జైల్లో దోమల అంశంపై తీవ్రంగా రెండు పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: