
బీజేపీ షేర్ చేసిన 31 సెకన్ల వీడియో క్లిప్.. తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన లీగ్ స్టేజ్ మ్యాచ్‌ది. ఆ మ్యాచ్ టైగా ముగిసిన సంగతి చాలామంది క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ఉండేది కాదు, బౌల్-ఔట్‌తో విజేతను తేల్చేవారు.
ఈ బౌల్-ఔట్‌లో భారత ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప.. ముగ్గురూ గురిచూసి వికెట్లను పడగొట్టారు. కానీ, పాకిస్థాన్ బౌలర్లు యాసిర్ అరాఫత్, ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిది మాత్రం కనీసం ఒక్కసారి కూడా వికెట్లను కొట్టలేక చతికిలపడ్డారు. దీంతో భారత్ 3-0 తేడాతో బౌల్-ఔట్‌ను గెలుచుకుంది. ఈ విజయమే ఆ తర్వాత టోర్నమెంట్‌లో భారత్ తర్వాతి దశకు చేరడంలో, చివరికి కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది.
ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, బీజేపీ "కుచ్ ఐసా థా (ఇది ఇలాగే జరిగింది). ఆపరేషన్ సిందూర్" అని క్యాప్షన్ పెట్టింది. దీని అర్థం చాలా స్పష్టం. క్రికెట్‌లో పాకిస్థాన్ ఎలాగైతే విఫలమైందో, "ఆపరేషన్ సిందూర్" తర్వాత పాకిస్థాన్ సైనిక ప్రతీకార యత్నాలు కూడా అలాగే బెడిసికొట్టాయని బీజేపీ పరోక్షంగా చెప్పింది. పాకిస్థాన్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఈ పోలిక తెచ్చింది.
2007 నాటికి టీ20 మ్యాచ్‌లు టై అయితే ఫలితం తేల్చేందుకు "సూపర్ ఓవర్" విధానం లేదు. దానికి బదులుగా "బౌల్-ఔట్" పద్ధతిని ఉపయోగించేవారు. ఇది ఫుట్‌బాల్‌లోని పెనాల్టీ షూటౌట్ లాంటిది. ఇందులో ప్రతీ జట్టు ఐదుగురు బౌలర్లను ఎంపిక చేసి, బ్యాటర్ లేకుండా నేరుగా వికెట్లను కొట్టమని చెబుతారు. ఏ జట్టు ఎక్కువసార్లు వికెట్లను పడగొడితే ఆ జట్టే విజేత. 2007 నాటి ఆ హై-ప్రెజర్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతమైన కచ్చితత్వంతో వికెట్లను కొడితే, పాకిస్థాన్ బౌలర్లు మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగా, మే 7న భారత సైన్యం పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో "ఆపరేషన్ సిందూర్" చేపట్టింది. ఈ ఆపరేషన్ జరిగిన కొద్ది రోజులకే బీజేపీ ఈ క్రికెట్ తరహా సెటైర్‌తో ముందుకొచ్చింది.
"ఆపరేషన్ సిందూర్"లో భాగంగా, పాకిస్థాన్ భూభాగంలోకి, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకెళ్లి లష్కరే తోయిబా (LeT), జైషే మహ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ సైనిక విజయగర్వాన్ని, నాటి క్రికెట్ గెలుపుతో ముడిపెడుతూ బీజేపీ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.