- ( ద‌క్షిణ తెలంగాణ‌ - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణ రాష్ట్ర పునర్విభజనలో ఓ కీలక మలుపుగా మారిన వరంగల్హన్మకొండ జిల్లాల వ్యవహారం, ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ శరీరానికి రెండు చేతుల్లా పరస్పరంగా అనుబంధంగా ఉన్న ఈ రెండు ప్రాంతాలను రెండు జిల్లాలుగా విడగొట్టడం వల్ల ఎదురవుతున్న సమస్యలు ఇప్పుడు ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు క‌లిగిస్తున్నాయి. వ‌రంగల్ జిల్లా పేరు కొనసాగుతున్నా, జిల్లా కలెక్టరేట్, కీలక శాఖలన్నీ హన్మకొండలో ఉండటం వల్ల, వరంగల్ జిల్లాకు చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారార్థం పక్క జిల్లా అయిన హన్మకొండకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అధికార పరంగా చూస్తే, రెండు జిల్లాల కార్యాలయాలు కేవలం కిలోమీటర్ల దూరంలో పక్కపక్కనే ఉండటం, ప్రజలకు అవసరమైన సేవలు పొందడంలో గందరగోళానికి దారి తీస్తోంది. ఈ పరిస్థితుల్లో రెండు జిల్లాల అవసరమేమిటి  అనే ప్రశ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.


ఇటీవల వరంగల్హన్మకొండ కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ప్రజా సంఘాలు ఈ డిమాండ్‌ను బాగా వినిపిస్తున్నారు. ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చా వేదికలు, సదస్సులకు విస్తృత స్పందన లభిస్తున్నది. వాస్తవానికి ఈ డిమాండ్ కొత్తది కాదు. జిల్లాల విభజన జరిగినప్పటి నుంచే ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. కానీ ఇప్పుడు, దీనికి రాజకీయ ప్రాధాన్యత కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వరంగల్, హన్మకొండను మళ్లీ కలిపి ఒకే జిల్లాగా చేస్తామ‌ని హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వ హయాంలో రెండు సంవత్సరాలు దాటినా, ఆ హామీ అమలు కాకపోవడంతో స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు.


మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్ మరింత ఉధృతం అవుతోంది.  రాజకీయంగా ఈ అంశాన్ని మళ్లీ ప్రజల్లో నాటేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రజా మనోభావాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా ఆందోళనలు, బహిరంగ చర్చలు జరగడం గమనార్హం. ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తక్షణ నిర్ణయంతో కాకుండా, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, వారి మద్దతుతోనే నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: