ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా సంచలనం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసు మరో కీలక దశలోకి ప్రవేశించింది. కోట్ల రూపాయల అవినీతి, లంచాలు, అక్రమ లాభాల వెనుక దాగి ఉన్న నిందితుల అసలు రూపం బయట పడుతోంది. ఇప్పటివరకు కేవలం అరెస్టులు , విచారణల తోనే ఆగిపోయిన కేసులో.. ఇప్పుడు ఆస్తుల జప్తు ప్రక్రియను ప్రారంభించారు. మొదటగా ఏ-1 నిందితుడు రాజ్ కేసిరెడ్డి పై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఆయన లిక్కర్ డబ్బులతో సొంతం చేసుకున్న ఆస్తుల విలువ ఏకంగా రూ.13 కోట్లు అని విచారణలో తేలింది. అందులో 10 కోట్ల విలువైన భౌతిక ఆస్తులు, మరో 3 కోట్ల నగదు బ్యాంకులో ఉన్నట్లు గుర్తించారు.


ఇక ఇవన్నీ అవినీతి డబ్బులతో కూడుకున్నవేనని నిర్ధారించడంతో.. ఏసీబీ కోర్టులో వాటిని జప్తు చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు .ఇది మొదటి అడుగు మాత్రమే. విచారణలో బయటపడ్డ ఇతర నిందితుల ఆస్తులపైనా ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకోబోతోంది. కొందరు నిందితులు హైదరాబాద్‌లో లగ్జరీ విల్లాలు, ఇళ్ల స్థలాలు, ఫామ్ హౌస్‌లు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు కనుగొన్నారు. ఇప్పటికే ఒక ఫామ్ హౌస్‌లో దాచిపెట్టిన రూ.11 కోట్ల నగదు స్వాధీనం కావడం కేసును మరింత సీరియస్ దశకు తీసుకెళ్లింది . ఇక చట్టపరమైన ప్రక్రియలో భాగంగా రెండు చార్జిషీట్లు ఇప్పటికే కోర్టులో దాఖలయ్యాయి. కానీ ఇక్కడితో ఆగిపోవడం లేదు.


ఈ మొత్తం స్కామ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు? ఆయన దక్కించుకున్న నగదు, బంగారం, ఆస్తులు అన్నీ బయటకు తీయాల్సి ఉంది. సిట్ దగ్గర ఈ విషయాలపై పక్కా సమాచారం ఉందని చెబుతున్నారు. సరైన సమయం వచ్చేసరికి ఈ రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెట్టి.. అసలు లబ్ధిదారులను బహిర్గతం చేసి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రజల రక్తమాంసాలు పీల్చుకుంటూ వచ్చిన ఈ లిక్కర్ మాఫియా ఇప్పుడు ఒక్కో అడుగుతో కూలిపోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కేసు తుది దశలోకి వెళ్ళేసరికి ఏపీ రాజకీయాల్లో పెద్ద తుపాన్ రాబోతుందనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: