వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇంటా బ‌య‌టా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ గ్రాఫ్ పెరుగుతుంద‌ని, ఓటమి సానుభూతిని అనుకూలంగా మలచుకోవచ్చని ఆశించినా.. అది సాధ్యం కాలేదు. ప్రజలతో మమేకం అయ్యే వ్యూహాలు సరిగ్గా పనిచేయక జగన్ ఇబ్బందులు మరింత పెరిగాయి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్న దాడులు, మీడియా విమర్శలు జగన్‌ను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తు కోసం జగన్ పలు ప్రయత్నాలు చేస్తున్నా.. అవి పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. నాయకులలో చైతన్యం లేకపోవడం, ప్రజల మధ్యకు వెళ్లి పార్టీ బలోపేతం చేయాలన్న జగన్ ఆదేశాలను విస్మరించడం వల్ల అసంతృప్తి మరింతగా పెరిగింది.


మీడియా ముందు కొంతమంది నాయకులు నోటి మాటలు మాట్లాడినా.. తరువాత మౌనం వహించడం కూడా జగన్‌కు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన పరిణామం వైసీపీలో ఇంట‌ర్న‌ల్‌ ఉద్రిక్తతలను బహిరంగం చేసింది. రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కో ఆర్డినేటర్‌గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని వ్యతిరేకిస్తూ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 50 మంది మాజీ ప్రజాప్రతినిధులు లేఖపై సంతకాలు చేశారు. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్‌తో లేఖను ఎక్స్‌లో పోస్టు చేయడం సంచలనంగా మారింది. అయితే ఆ లేఖను కొద్ది సేపట్లోనే తొలగించారు. ఈ పరిణామంపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగ వేదికలపై ప్రదర్శించడం సరైంది కాదని ఆయ‌న భావిస్తున్నారు.


గత నాలుగేళ్లుగా పార్టీ కార్యకలాపాలన్నీ సజ్జల ఆధ్వర్యంలోనే నడిచాయి. ఆయన సూచనలు, సలహాలు ఎక్కువగా అమలవుతుండటంపై చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. గడచిన ఎన్నికల్లో పార్టీకి దెబ్బ తగలనడానికి కారణం కూడా ఆయన వ్యూహాలే అన్న అభిప్రాయం కొంతమంది నేతల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే 50 మంది మాజీ నేతలు కలిసి ఆయనను తప్పించాలనే డిమాండ్ చేయడం పెద్ద దుమారం రేపింది. మొత్తం మీద ఈ లేఖ వ్యవహారం జగన్ నాయకత్వంపై, అలాగే పార్టీ భవిష్యత్తుపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఇప్పటికే ప్రజలతో సంబంధాలు బలహీనంగా ఉన్న తరుణంలో.. ఇలాంటి లోపలి గొడవలు వైసీపీకి మరింత కష్టాలను తెచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యను జగన్ ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: