టిడిపి పార్లమెంటరీ పార్టీ కమిటీల నియామకాలు దాదాపు పూర్తయ్యాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సారి కమిటీల రూపకల్పనలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలపరచి, బూత్ స్థాయి నుంచి జిల్లాల వరకు పటిష్టమైన నిర్మాణాన్ని కల్పించడం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే పార్లమెంటరీ స్థాయిలో కమిటీల నియామకాలు అత్యంత కీలకంగా మారాయి. చిన్న పొరపాటు కూడా పార్టీకి నష్టంగా మారే అవకాశం ఉందని భావించి, సీనియర్ నాయకుల సలహాలతోనే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇటీవల వైసీపీ నుంచి టిడిపిలోకి చేరిన నాయకులు అనేక మంది ఉన్నారు. వారిని కూడా ఈ కమిటీల్లో భాగం చేయాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. కానీ సీనియర్ టిడిపి నేతలు మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. పార్టీ కోసం ఎన్నాళ్ల బట్టో పనిచేసిన కష్టపడిన నాయకులను పక్కన పెట్టి, తాజాగా చేరిన వారికి పదవులు ఇస్తే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని వారు చెబుతున్నారు.


ఈ జంపింగ్ నేత‌ల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డం వ‌ల్ల భవిష్యత్తులో పార్టీలో గ్రూపుల గోల‌కు ఆజ్యం పోసే ప్రమాదం ఉందని సీనియర్ నేతల వాదన. దీంతో జంపింగ్ చేసి వచ్చిన నేతలకు పార్లమెంటరీ కమిటీల్లో చోటు దొరకలేదని సమాచారం. ఇప్పటికే కమిటీల జాబితా సిద్ధమైనా.. అధికారికంగా విడుదల చేయకపోవడానికి ఇదే కారణమని పార్టీలో గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన నేతలు మాత్రం తామూ ఆధిపత్యం ఉన్న ప్రాంతాల కారణంగానే టిడిపిలోకి తీసుకున్నారని, ఇలాంటి సందర్భంలో అవకాశాలు ఇవ్వకపోతే తమ స్థితి దెబ్బతింటుందని వాదిస్తున్నారు.


మరోవైపు కొందరు సీనియర్ నేతలు, కొత్తగా వచ్చిన వాళ్లు కోవర్టుల్లా మారి పార్టీ అంతర్గత విషయాలను వైసీపీకి చేరవేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎదుర్కొంటున్న సవాల్ మరింత క్లిష్టంగా మారింది. ఒకవైపు కొత్తగా చేరిన వారిని సంతృప్తి పరచాల్సిన అవసరం, మరోవైపు పాత సీనియ‌ర్‌ నాయకులను శాటిస్‌పై చేయ‌డం స‌వాల్‌గా మారింది. ఏదేమైనా టిడిపి పార్లమెంటరీ కమిటీల వ్యవహారం క‌త్తిమీద సాములా మారింది. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: