
- ఉద్యోగులతో చాకిరీ, వేధింపులు
- రెవెన్యూ, పోలీస్ అధికారులను పార్టీ కార్యకర్తలుగా మారుస్తున్నారు
- బీసీవైకు ఒక్క అవకాశం ఇస్తే ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు
- బీసీవై అధినేత బోడే రాయచంద్ర యాదవ్
ఏపీలో ప్రభుత్వాలు మారినా.. నాయకులు మారినా.. అధికారం మారుతున్నా ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని బీసీవై జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ విమర్శించారు. సోమవారం ఏపీసీపీఎస్ పెన్షన్ మార్చ్ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం రైలు అయితే.. ఉద్యోగస్తులు ఇంజన్ లాంటి వారని కానీ ఈ రోజు ప్రభుత్వాలు తీసుకుంటోన్న నిర్ణయాల వల్ల, ఉద్యోగస్తుల పట్ల అనుసరిస్తోన్న విధానాలు, వేధింపులతో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దినదినగండంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆర్థిక, ఉద్యోగ భద్రతతో పాటు పదవీ విరమణ తర్వాత పెన్షన్ భద్రత ఉంటుందన్న నమ్మకం ఉద్యోగస్తుల్లో పోయిందని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్న ప్రతిసారి ఉద్యోగులపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని.. ఉద్యోగుల హక్కులు అణిచివేతకు గురవుతున్నాయని రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఉపాధ్యాయులను నాన్ టీచింగ్ పనులకు వాడుకుంటూ.. పోలీసు, రెవెన్యూ ఉద్యోగులను అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తల్లా ట్రీట్ చేసే పరిస్థితికి ప్రభుత్వాలు దిగజారిపోయాయన్నారు.
ఆర్థిక సంస్కరణల పేరుతో ఉద్యోగస్తు జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో వేసిన భట్టాచార్య కమిషన్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే.. వీళ్లు సీపీఎస్ విధానంతో 20 లక్షల మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాడం ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుస్తులపై నాడు కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండి కూడా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అభీష్టానికి వ్యతిరేకంగా సీపీఎస్ అమల్లోకి తీసుకువచ్చారన్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా దీనిపై ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో
అనేక పోరాటాలు చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని గతంలో జగన్మోహన్‌రెడ్డి, తర్వాత కూటమి నాయకులు అందరూ.. ఉద్యోగస్తుల ఓట్లతో గద్దె నెక్కాక ఉద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. సీపీఎస్ రద్దు విషయంలో ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. 2003లో డీఎస్సీ ద్వారా ఎంపికైన 16 వేల మంది ఉద్యోగులను కూడా 2004 తర్వాత అమలులోకి వచ్చిన సిపిఎస్ విధానంలోకి తీసుకువచ్చి వారికి తీవ్ర అన్యాయం చేశారని రామచంద్ర యాదవ్ వాపోయారు.
దీనిపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో అక్కడ ఉద్యోగులకు న్యాయం జరిగినా.. ఏపీ ఉద్యోగస్తుల విషయంలో ఏ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన డీఎస్సీ, గ్రూప్స్ నియామకాల్లో వచ్చే ఉద్యోగులకు సీపీఎస్ అమలు చేస్తారా ? లేదా గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీపీఎస్ అమలు చేస్తారో ఇప్పటకీ సరైన స్పష్టత లేదన్నారు. ఇప్పటికి అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరచి సీపీఎస్‌ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని.. ఈ విషయంలో ఏపీ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పోరాటానికి బీసీవై పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ సీపీఎస్ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయనిపక్షంలో భవిష్యత్తులో బీసీవై పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని.. రాష్ట్ర ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇస్తే ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని కూడా రామచంద్ర యాదవ్ ప్రకటించారు.