వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మైండ్‌బ్లోయింగ్ స్ట్రాటజీలతో రాజకీయాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చుతున్నారు అంటున్నారు జనాలు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా జగన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 1955లో పులివెందుల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అక్కడ వరుస విజయాలు సాధించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కింది. 1978, 1983, 1985లో వరుసగా గెలిచి తొలి హ్యాట్రిక్ సాధించిన ఆయన, 1999, 2004, 2009లో మళ్లీ వరుస విజయాలతో రెండోసారి హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించారు. ఆయన తర్వాత అదే స్థాయి గుర్తింపు పొందింది జగన్ మాత్రమే. 2014, 2019, 2024లో వరుస విజయాలతో జగన్ పులివెందులలో ప్రత్యేకమైన స్థానం సంపాదించారు. ఆయన అక్కడ ఎన్ని సార్లు పోటీ చేసినా గెలుస్తారనే నమ్మకం అందరిలో ఏర్పడింది. తండ్రి రికార్డును అధిగమిస్తారని కూడా భావించారు.


అయితే వైఎస్సార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో తమ పట్టు సాధించాలన్న ఉద్దేశంతో టిడిపి కూటమి బలంగా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జరిగిన పులివెందుల జడ్పిటిసి ఉపఎన్నికల్లో టిడిపి కూటమి విజయం సాధించి వైఎస్సార్సీపీకి షాక్ ఇచ్చింది. దీంతో వైఎస్సార్సీపీ మరింత జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది. 2029 నాటికి పులివెందులలో టిడిపి పట్టు సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. దీంతో పులివెందుల మున్సిపాలిటీపై కూడా టిడిపి ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే జగన్ డబుల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు.



తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను పూర్తిగా తన భార్య వైఎస్ భారతీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించిన జగన్, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అదే సమయంలో ఆయన తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారని సమాచారం. రాష్ట్ర స్థాయి వ్యవహారాలపై పూర్తి దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్సీపీ వర్గాల సమాచారం. జగన్ లేని లోటు పులివెందులలో కనిపించకుండా ఉండాలంటే వైఎస్సార్ కుటుంబ సభ్యురాలే బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు. విజయమ్మ, షర్మిల ఇప్పటికే జగన్‌కు దూరంగా ఉన్నందున, ఇప్పుడు పులివెందుల బాధ్యతలు భారతి చేతుల్లోకి రావడం ఖాయమని చెబుతున్నారు.



పులివెందుల ప్రజలకు వైఎస్సార్ కుటుంబంతో ఉన్న భావోద్వేగ బంధాన్ని భారతి మరింత బలపరుస్తుందనే నమ్మకంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ తర్వాత పులివెందుల ప్రజలకు భారతి ఎంతగా చేరువవుతుందో చూడాలి అంటున్నారు రాజకీయ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: