సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మళ్లీ బీఆర్ఎస్‌లో చేరడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించిన ఆయన, గత ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లారు. ముఖ్యంగా బీఎస్పీ తరపున పోటీ చేసి భారీ ఓట్లు సాధించిన ఆర్ఎస్ ప్రవీణ్‌ను బీఆర్ఎస్‌లో చేర్చుకోవడమే ఆయన కోపానికి కార‌ణ‌మైంది. దీంతో ఆగ్రహంతో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అయితే అక్కడ ఆయనకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. పైగా కాంగ్రెస్ నాయకులు తగిన గౌరవం ఇవ్వకపోవడంతో ఆయన ఆ పార్టీలో ఉండ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. కోనప్ప రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే 2004లో ఆయ‌న కాంగ్రెస్ నుంచి ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు.


ఆ త‌ర్వాత 2014లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో కాంగ్రెస్‌లో టిక్కెట్ రాకపోవడంతో ఆయన, ఇంద్రకరణ్ రెడ్డి కలిసి బీఎస్పీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బీఆర్ఎస్‌లో చేరారు. 2018లో కూడా బీఆర్ఎస్ తరపున గెలిచి సిర్పూర్ ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కించుకున్నారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించగా, కోనప్ప ఓటమి పాలయ్యారు. దీనికి ప్రధాన కారణం బీఎస్పీ నుంచి ప్రవీణ్ పోటీ చేసి ఓట్లను విపరీతంగా చీల్చడమే అని ఆయన వర్గం భావించింది. అదే సమయంలో ప్రవీణ్‌ను పార్టీలో చేర్చుకోవడం కోనప్పను మరింత కలచివేసింది. దాంతో ఆయన బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కానీ అక్కడ కూడా పరిస్థితులు మారలేదు. తనకు సరైన గుర్తింపు, ప్రాధాన్యం లేకపోవడంతో పదే పదే అసంతృప్తి వ్యక్తం చేశారు.


చివరికి ఆయన కాంగ్రెస్‌లో కొనసాగడం ప్రయోజనం లేదని భావించి మళ్లీ బీఆర్ఎస్ చేరికకు సిద్ధమయ్యారు. ఇటీవల బీఆర్ఎస్ హైకమాండ్ ఆయనను సంప్రదించి పార్టీ కండువా కప్పింది. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, మాజీ జెడ్‌పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్‌లో చేరారు. ఆసక్తికరంగా, ఈ సారి సిర్పూర్ టికెట్ విషయమై ఎలాంటి సందేహం లేకుండా కేటీఆర్ కోనప్పకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌కు పార్లమెంట్ లేదా వేరే నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. దీంతో సిర్పూర్ నుంచి వచ్చే ఎన్నికల్లో కోనప్పే బీఆర్ఎస్ అభ్యర్థి అవుతారని స్పష్టమైంది. మొత్తానికి, కోనప్ప తిరిగి బీఆర్ఎస్ చేరికతో ఆ పార్టీకి సిర్పూర్‌లో బలం పెరిగింది. కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్న ఆయన తిరిగి గులాబీ కండువా కప్పుకోవడంతో ఆ నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు మళ్లీ ఆసక్తికరంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: