ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు, దూషణలు, అబద్ధ ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. దీనిపై చాలాసార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లోనే పవన్ కళ్యాణ్, "సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధాలు, దూషణలు భరించలేని స్థాయికి చేరాయి.. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది" అని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ఇంతకుముందు సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారం చేస్తున్న వారిపై అరెస్టులు చేసింది. కానీ, సుప్రీంకోర్టు సోషల్ మీడియాను భావప్రకటన స్వేచ్ఛలో భాగమని ప్రకటించింది. ఎవ్వరినీ కేవలం సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో హైకోర్టు కూడా కేసుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, డీసీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి అని ఆదేశించింది. ఈ తీర్పుల కారణంగా ప్రభుత్వం కాస్త ఇరుకులో పడిపోయింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరికొందరు రెచ్చిపోతున్నారు. ఈ పరిణామాల నడుమ, ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా దూకుడుపై అధ్యయనం చేయడం కోసం ఐదుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఐటీ, ఇన్ఫర్మేషన్ రంగంలో అనుభవం ఉన్న మంత్రి నారా లోకేష్‌ను ఛైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా మంత్రులు అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి ఉన్నారు. తాజాగా ప్రభుత్వం జీవో విడుదల చేస్తూ ఈ కమిటీకి మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ కమిటీ ప్రధానంగా సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై దృష్టి పెడుతుంది. తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్, నేషనల్ సెక్యూరిటీకి ముప్పు కలిగించే కంటెంట్‌పై నిఘా పెట్టనుంది.

అంతర్జాతీయ బెస్ట్ ప్రాక్టీసులను పరిశీలించి, వాటి ఆధారంగా సిఫారసులు చేయనుంది. సాధారణ ప్రజల హక్కులు కాపాడబడేలా సూచనలు చేయడమే కాకుండా, అవసరమైతే ప్రత్యేక నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు చేసే అవకాశమూ ఉంది. కమిటీ వారానికి ఒకసారి భేటీ కావాలని, సాధ్యమైనంత త్వరగా సిఫారసులు ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విధానాలు, కోర్టుల ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని సోషల్ మీడియా దూకుడుకు కళ్లెం వేసే విధంగా నిర్ణయాలు తీసుకోనుంది. మొత్తంగా, సోషల్ మీడియా వల్ల కలిగే అప్రజాస్వామిక ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ఇదే సమయంలో ప్రజల హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ కూడా కాపాడబడేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: