
కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమే అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబువారి ఏకైక పుత్రరత్నం.. మాజీ అమాత్యులు.. నారా లోకేష్ బాబు జాతకాలు చెప్పుకొంటున్నారని చెబుతున్నారు. ఇప్పటి వరకు మాట్లాడిన దానికి భిన్నంగా కొంత తత్వం(బోధపడి ఉంటుంది?) రంగరించి మాట్టాడుతున్నారు. జగన్‌కు మూడుతుందని.. ప్రజలే బుద్ధి చెబుతారని అందరూ చెప్పే మాటలు, చేసే విమర్శలే అయినప్పటికీ.. వీటిని కొంత తాత్వికం చేసి చూపించారు లోకేష్ వారు.
ఏపీలో విగ్రహాల తొలగింపుపై చిన్నబాబు నిగ్రహం కోల్పోయారు. 90 కేసులు ఉన్న క్రిమినల్‌కి కాంస్య విగ్రహం పెడతామని స్వయంగా మంత్రి ప్రకటించినప్పుడే రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదని అర్థమైందని నిరాశ, నిస్పృహలతో కూడిన వ్యాఖ్యలు వల్లించారు. బాపట్లలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం తొలగించారని, ఇప్పుడు నెల్లూరు జిల్లా కావాలిలో తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, కూడు, గూడు, గుడ్డ ఉన్ననాడే పేదవాడికి సంపూర్ణ స్వరాజ్యమన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం తొలగించారని ట్విట్టర్ వేదికగా చరిత్రను తొవ్వుకొచ్చారు.
విగ్రహాలు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్న చిన్నబాబు.. తలకెక్కిన అధికార మదంతో వ్యవహరిస్తున్నారంటూ.. ఒకింత తప్పులు లేని తెలుగునే మాట్లాడారు. అంతేకాదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెబుతూ.. తనదైన శైలిలో గంటల పంచాంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. `వైఎస్ జగన్ గ్యాంగ్‌కి ప్రజలే బుద్ధి చెబుతారు` అని లోకేష్ `సుత్తి`మెత్తగా హెచ్చరించారు. అంతేకాదు, ఈ బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీ అయ్యేరోజును ఖచ్చితంగా లెక్కగట్టి మరీ చెప్పారు. అదే 2024 ఎన్నికల్లోనట! మొత్తానికి లోకేష్ కాలజ్ఞాన తత్వాలు ఏమేరకు నిజమౌతాయో చూడాలి. పనిలోపనిగా.. తన గెలుపు గురించి, తన పార్టీ గురించి కూడా ఈ పంచాంగంలో వివరిస్తే..బాగుండేదని అంటున్నారు పరిశీలకులు.
90 కేసులు ఉన్న క్రిమినల్ కి కాంస్య విగ్రహం పెడతామని స్వయంగా మంత్రి గారు ప్రకటించినప్పుడే రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదని అర్థమైంది.బాపట్లలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం తొలగించారు.(1/3) pic.twitter.com/NuEqiLVIU4
— lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 19, 2020