చంద్రబాబునాయుడు, లోకేష్+టీడీపీ నేతలపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వేస్తున్న పంచులు అందరికీ తెలిసిందే. అలాంటి పంచ్ తో పాటు తాజాగా చేసిన ఓ హెచ్చరిక టీడీపీ నేతలతో పాటు మామూలు జనాల్లో  కూడా టెన్షన్ పెంచేస్తోంది. ఇంతకీ విజయసాయి చేసిన ట్వీట్ లో ఏముందంటే ‘23వ తేదీ టీడీపీకి కాలరాత్రి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. రెండేళ్ళక్రితం మే 23వ తేదీ, గురువారం టీడీపీ అంతలా వణికిపోయింది. గోడదెబ్బ-చెంపదెబ్బ అన్నట్లుగా ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోంది. ఆ రోజు పచ్చపార్టీ పటాపంచలేనా ? దేవుడు ఏం రాసిపెట్టాడో’ ? అనే ట్విట్ ఇపుడు చాలా హాట్ టాపిక్ అయిపోయింది. జూలై 23వ తేదీన టీడీపీలో ఏమి జరగబోతోంది అనే అంశంపై జనాలు ఎవరికి వారుగా ఏవేవో ఊహించేసుకుంటున్నారు.




సరే ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి కానీ అసలు విజయసాయిరెడ్డి ఆలోచన ప్రకారం రాబోయే  జూలై 23వ తేదీన టీడీపీ ఏమి జరగబోతోందో ఎవరికీ అర్ధం కావటంలేదు. అందుకనే ఆయన ట్వీట్ కు సమాధానంగా ప్లీజ్ జూలై 23వ తేదీన టీడీపీలో ఏమి జరగబోతోందో చెప్పండంటూ రిక్వెస్టులు పెడుతున్నారు. మెజారిటి జనాలు ఊహించినదాని ప్రకారం రెండు అంశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొదటిదేమో టీడీపీలోని 23 మంది ఎంఎల్ఏల్లో ఇప్పటికే నలుగురు చంద్రబాబుపై తిరుగుబాటు లేవదీశారు. వీళ్ళంతా ఇంకా టీడీపీ ఎంఎల్ఏలుగానే ఉన్నారు. బహుశా వాళ్ళేమైనా ఆరోజు రాజీనామాలు చేస్తారా ? అనే ఆలోచన మొదలైంది.




ఇక రెండోదేమంటే తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏలతో మరింతమంది ఎంఎల్ఏలు ఆరోజున చేతులు కలపబోతున్నారా అనే ఊహాగానాలు కూడా మొదలైంది. ఒకవేళ అదే నిజమైతే శాసనసభాపక్షంలో నిట్టనిలువుగా చీలకరావటం ఖాయం. ఇదే జరిగితే దీని ప్రభావం పార్టీమీద కూడా పడుతుంది. దాన్ని చంద్రబాబు తట్టుకునే స్ధితిలో ఉన్నారా ? అన్నది డౌటే. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజును టీడీపీ ప్రోత్సహిస్తున్నట్లుగానే టీడీపీ తిరుగుబాటు ఎంఎల్ఏల విషయంలో కూడా వైసీపీ అదే చేస్తే చంద్రబాబు పనిగోవిందానే. సరే జూలై 23వ తేదీన ఏమి జరగబోతోందనేది మాత్రం చాలా టెన్షన్ గాను ఆసక్తిగాను మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: