
సహజ వనరులతో కొవ్వత్తులు, బుడ్డి దీపాలు ఉన్ననూ అవి కేవలం సంపన్నుల వరప్రసాదాలుగా ఉండేవి. నేటి ఆధునిక జీవన విధానంలో సామాన్యునికి కూడా విశేష భోగ వసతులు అందుబాటులో ఉన్నాయి. అందుకు కారణం తమ మెదడులోని ఆలోచనలకు పదునుపెట్టి సరికొత్త విధానాలను, సాంకేతిక వసతులను, పరికరాలను కనుగొన్న ఎందరో శాస్త్రవేత్తలు. ఆ కోవలోనే పయనిస్తూ తన పరిశోధనల ద్వారా విద్యుత్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు అంకురార్పణ చేసి, నేడు మనం అనుభవిస్తున్న అన్ని రకాల ఆధునిక పరిజ్ఞానానికి మూలపురుషుడు అయిన థామస్ ఆల్వా ఎడిసన్ నేటి మన ఆదర్శమూర్తి.ఎడిసన్ జీవితం అంతా పూలపాన్పుల మయం కాదు. బాల్యంలో తాను కూడా ఎన్నో ఇబ్బందులకు గురైనారు. 1847, ఫిబ్రవరి 11న, యు.ఎస్. ఎ. లోని ఒహాయో రాష్ట్రంలో మిలాన్ అనే పట్టణంలో జన్మించిన ఎడిసన్ పెద్ద చదువులు చదవలేదు.
పన్నెండో ఏటనే రైలురోడ్డు కంపెనీ లో చేరి చదువును వదిలేశాడు. కానీ తన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఎదో కొత్తదనం కోసం వెంపర్లాడుతూనే ఉన్నాయి. అందుకనే సాంకేతిక పరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సరికొత్త విధానాలను కనుక్కోవడానికి సమయాన్ని వెచ్చించడం ప్రారంభించాడు. అమెరికాలో ఏర్పడిన సివిల్ వార్ సమయంలో టెలిగ్రాఫ్ యొక్క ఉపయోగం వెలుగులోకి వచ్చింది. ఒక టెలిగ్రాఫర్ గా ఎడిసన్ పనిలో చేరి ఇంకా ఆ సాంకేతికతను ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చని ఆలోచించడం ప్రారంభించాడు. సహజసిద్ధంగా తనకు ఉన్న చెముడు ప్రభావం వలన ఆ టెలిగ్రాఫ్ కోడ్స్ విని డీకోడ్ చేయడం చాలా కష్టమైంది. అందుకనే ఆ విద్యుత్ తరంగాలను యధాతధంగా అక్షరాలుగా మార్చి ప్రింట్ చేసే పరికరం కోసం శ్రమించడం మొదలుపెట్టారు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని తను అనుకొన్న టెలిగ్రామ్ పరికరాన్ని తయారుచేశారు. అది మొదలు ఎన్నో విధములైన విధ్యుత్ పరికరాలు ముఖ్యంగా ధ్వనికి సంబంధించిన విషయాలమీద దృష్టి పెట్టారు. బహుశా తన వినికిడి ఇబ్బంది తనను ఈ విధమైనా పరిశోధనవైపు మళ్ళించిందేమో!