సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు వివరణ చెబుతూ "మకరం" అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, మొక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, పెద్దలు చెబుతూ ఉంటారు. 


వాస్తవానికి ఖగోళ ప్రకారంగా డిసెంబర్ 22 తారీకు నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది, కాని మనకు ధనర్మాసం ఈ రోజుతో పూర్తి అవ్వడం వలన సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్య దినాలుగా పరిఘనలోకి తీసుకుంటారు.పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని విశ్వసిస్తారు.అందుకే మహాభారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాపితామహుడు ఈ పర్వదినం వరకు ఎదిరి చూసి ఉత్తరాయణం లో రథసప్తమి"మాఘ శుద్ధ సప్తమి" నాడు మొదలుకోని తన పంచప్రాణాలను రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ చివరకు మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి మొక్షం పొందాడు. జగద్గురువు ఆది శంకరాచార్యుడు ఈ రోజునే సన్యాసం స్వీకరించాడు. పూర్వము గోదాదేవి పూర్వఫల్గుణ నక్షత్రం లో కర్కాటక లగ్నం లో తులసి వనం లో జన్మించినది.ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుడిని ఆరాధించినది ధనుర్మాసం మొత్తం ఒక నెల రోజులు నిష్టతో వ్రతమాచరించి చివరి రోజైన మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుంది.ఈ విధంగా మకర సంక్రాంతికి ఎన్నో ప్రత్యేకతలను చోటు చెసుకుంది.


'మకర సంక్రాంతి'  సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యదినం. ఈ పండుగకు మన ఇంటికి ధన, ధాన్య రాశులు చేరతాయని నానుడి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఇల్లిల్లూ ఒక కొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. ఈ పండుగకు కొత్త శోభ తీసుకురావడానికి వారం పది రోజుల ముందే ఇళ్ళకు సున్నాలు, రంగులు వేయడం హిందువుల ఆనవాయితీ.


సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో స్వీట్స్ తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో ఈ పండుగ వస్తుందంటే.. పిండి వంటలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి. నువ్వులముద్దలు, అరిసెలు, సకినాలు, చెగోడిలు, పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన పిండి వంటకాలు చేసుకుని కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. గంగిరెద్దులవారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: