
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో భక్తులు అనేక నియమాలను పాటిస్తూ వ్రతాలు, పూజలు చేస్తారు. ఈ మాసంలో ఆచరించాల్సిన ముఖ్యమైన పనులు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను తెలుసుకుందాం.
కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదులలో లేదా కనీసం బావి నీటిలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఇది సకల పాపాలను తొలగిస్తుందని నమ్మకం. నదీ స్నానం వీలుకానివారు తమ స్నానపు నీటిలో గంగాజలం లేదా పసుపు కలుపుకోవచ్చు. కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. ఉభయ సంధ్యలలో (ఉదయం, సాయంత్రం) ఇంటిలో, పూజా మందిరంలో, ముఖ్యంగా తులసి కోట వద్ద దీపాలు వెలిగించాలి. ఆలయాల్లో లేదా నదీ తీరాలలో దీప దానం చేయడం వల్ల తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి. దీపదానానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఉత్తమం.
ఈ మాసంలో తులసి పూజ, తులసి కళ్యాణం (ఏకాదశి నాడు) అత్యంత శుభప్రదం. తులసి కోట ముందు దీపం వెలిగించి పూజించడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శివుడిని, విష్ణువును నియమ నిష్టలతో పూజించాలి. కార్తీక సోమవారాల్లో శివాలయ దర్శనం, కార్తీక పురాణం లేదా భగవద్గీత పఠనం చాలా మంచిది. ఈ మాసంలో దాన ధర్మాలు గోప్యంగా చేయడం వలన మేలు జరుగుతుంది. పేదలకు, అనాథలకు చలికాలం కాబట్టి స్వెటర్లు, దుప్పట్లు వంటివి దానం చేయడం శుభప్రదం. నేలపై పడుకోవడం వల్ల కూడా పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు.
ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవకుండా ఆలస్యంగా పడుకోవడం తగదు. నెల రోజుల పాటు మాంసాహారం, మద్యం సేవించడం, తామస గుణాన్ని పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి, గుమ్మడి కాయ, ముల్లంగి, బెండకాయ, పొట్లకాయ, ఎక్కువ విత్తనాలు ఉన్న పండ్ల వంటి కొన్ని ఆహార పదార్థాలను తినకూడదని చెబుతారు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కార్తీక మాసంలో తులసి పూజకు ప్రాధాన్యత ఉన్నందున తులసి మొక్కలను తెంచకూడదు.