బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడు టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెల్సిందే. కాగా ఈ మ్యాచ్ లో ఓటమి దిశగా సాగిన భారత్... ఐదో రోజు అద్భుతమైన ఆటతో ఆసీస్ కు చుక్కలు చూపించింది. సునాసయంగా గెలుస్తామని భావించిన ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని రోజంతా పరీక్షించింది. కాగా ఐదో రోజు ఆటలో యువ ఆటగాడు రిషబ్ పంత్, సీనియర్ బ్యాట్స్ మెన్ ఛటేశ్వర్ పుజారాతో కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్ని మలుపు తిప్పగా, చివరి సెషన్ లో హనుమ విహారి, రవి చంద్రన్ అశ్విన్ ల పోరాట పటిమ ఆసీస్ విజయానికి బ్రేక్ వేసింది.

అయితే  పంత్ అటాకింగ్ బ్యాటింగ్ వల్ల ఓ సమయంలో మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తుందనే ఆశలు కూడా చిగురించాయి. అయితే కీలక సమయంలో పంత్,  పుజారా ఔటవడం, చేతిలో తగిన వికెట్లు లేకపోవడంతో భారత్ మ్యాచ్ ను డ్రా చేసే దిశగా పోరాటం చేసింది. ఇందులో భాగంగానే విహారి, అశ్విన్ మరో వికెట్ పడకుండా  గొప్పగా బ్యాటింగ్ చేసారు. వీరిలో ఎవరు అవుట్ అయినా భారత్ టెయిలెండర్లు మ్యాచ్ ను అసీస్ కు అప్పగించేవారే. హనుమ విహారి 161 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలవడం ఈ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది.

ఈ మ్యాచ్ పై బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో  ట్విట్టర్ వేదికగా స్పందించారు. విహారి ఇన్నింగ్స్‌ను ఆయన తీవ్రంగా విమ‌ర్శించారు. 7 పరుగులు చేయడానికి 109 బంతులు ఆడడం ఏంటని ప్రశ్నించాడు. ఈ మ్యాచ్‌లో హనుమ బిహారి.. టీమిండియా చారిత్రక విజయం సాధించే అవకాశాన్ని చంపేయడమే కాకుండా క్రికెట్‌ని కూడా హత్య చేశాడని వ్యాఖ్యానించాడు. విజ‌యం కోసం ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డం నేర‌మే అవుతుందని పేర్కొన్నాడు. కాగా బాబుల్ తన ట్వీట్ లో హనుమ విహారి అని అనకుండా అల‌వాటైన నార్త్ ఇండియ‌న్ స్టైల్లో హ‌నుమ బిహారి అని రాశారు. అయితే ఈ ట్వీట్ పై స్పందించిన విహారి ఆ విమర్శలను పక్కన పెట్టి చాలా సింపుల్ గా రిప్లై ఇచ్చాడు. తన పేరు హనుమ బిహారి కాదు హనుమ విహారి అంటూ చెప్పేలా తన పేరును ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇపుడు వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: