మన దేశంలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే... ముఖేష్‌ అంబానీ అనే సమాధానం ఠక్కున వినిపిస్తుంది. ఆయన ఆస్తి విలువ అక్షరాల 3 లక్షల 80 వేల 700 కోట్ల రూపాయలు. మరి అంబానీ తర్వాత ఎవరెవరున్నారు..? వాళ్ల అస్తుల విలువెంత..? రానున్న రోజుల్లో భారత్‌లో సంపన్నుల సంఖ్య పెరుగుతుందా..? తగ్గుతుందా..? దీనిపై అంతర్జాతీయ సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిస్తే.. ! 
మన దేశంలో సంపదకు కొదువ లేదు. కాకపోతే దేశంలోని మొత్తం సంపదలో పది శాతం... కేవలం పాతిక మంది వద్దే ఉందంటోంది చైనాకు చెందిన హురున్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌. ఐ.ఐ.ఎఫ్.ఎల్ వెల్త్‌-హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ ప్రకారం గత ఏడాదితో పోల్చితే... ఈ సారి వేయి కోట్లకు పైగా ఆస్తి గల భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది.   


భారత్‌లోని అంత్యంత ధనవంతుల జాబితాలో తొలి పది మందిలో నలుగురు మహరాష్ట్ర వాళ్లున్నారు. గుజరాత్‌, కర్ణాటకల నుంచి చెరొకరికి చోటు దొరికింది. ఇద్దరు లండన్ లో నివసిస్తుండగా, ఒకరు మొనాకో వాసి.  ఎప్పటిలాగే, భారతీయ అపర కుబేరుల జాబితాలో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచారు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ. 62 ఏళ్ల ముఖేష్‌ అంబానీ ఆస్తి విలువ 3 లక్షల 80 వేల 700 కోట్ల రూపాయలు. తర్వాత స్థానంలో 83 ఏళ్ల ఎస్పీ హిందుజా, అతని కుటుంబం నిలిచింది. లండన్‌లో నివసిస్తున్న హిందుజాల ఆస్తి విలువ లక్షా 86 వేల 500 కోట్ల రూపాయలు. ఇక కర్ణాటక వాసి అజిం ప్రేమ్‌ జీకి మూడో స్థానం దక్కింది. 74 ఏళ్ల ప్రేమ్‌ జీ ఆస్తి విలువ లక్షా 17 వేల కోట్లు పైమాటే. నాలుగో స్థానంలో 69ఏళ్ల లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌, అతని కుటుంబం నిలిచింది. లండన్‌లో నివసిస్తున్న వీరి ఆస్తి విలువ లక్షా 7 వేల 300 కోట్లు. 57 సంవత్సరాల గౌతమ్‌ అదానీ, అతని కుటుంబం ఐదో స్థానంలో నిలిచింది. గుజరాత్‌ వాసులైన అదానీల ఆస్తి విలువ 94 వేల 500 కోట్ల రూపాయలు. పోర్టులు, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ నిర్వహిస్తోంది అదానీ ఫ్యామిలీ. మహారాష్ట్రకు చెందిన 60 ఏళ్ల ఉదయ్‌ కోటక్‌... 94 వేల కోట్లకు పైగా ఆస్తితో ఆరో స్థానంలో నిలిచారు. మహారాష్ట్రకే చెందిన 78 ఏళ్ల సైరస్‌ పూనా వాలా 88 వేల 800 కోట్ల రూపాయల ఆస్తితో ఏడో స్థానం దక్కించుకున్నారు. అలాగే సైరస్‌ పలోంజీ మిస్త్రీకి ఎనిమిదో స్థానం దక్కింది. ఈయన ఆస్తి విలువ 76 వేల 800 కోట్ల రూపాయలు. భారత్‌లోని టాప్‌ టెన్‌  కోటీశ్వరుల్లో 51 ఏళ్ల సైరస్‌ పలోంజీ మిస్త్రీయే పిన్న వయస్కుడు. మొనాకో వాసి షాపూర్‌ పలోంజీ మిస్త్రీకి తొమ్మిదో స్థానం దక్కింది. 54 ఏళ్ల షాపూర్‌ పలోంజీ మిస్త్రీ ఆస్తి విలువ 76 వేల 800 కోట్ల రూపాయలు. పదో స్థానంలో మహారాష్ట్రకు చెందిన దిలీప్‌ సంఘ్వీ నిలిచారు. సన్‌ ఫార్మా వ్యవస్థాపకుడైన 63 ఏళ్ల దిలీప్‌ సింఘ్వీ ఆస్తి విలువ 71 వేల 500 కోట్ల రూపాయలు. 


ఐ.ఐ.ఎఫ్.ఎల్ వెల్త్‌-హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ ప్రకారం దేశంలో వెయ్యి కోట్లకుపైగా సంపద గల కోటీశ్వరులు 953 మంది ఉన్నారు. గత ఏడాది ఈ సంఖ్య 831గా ఉంది. అంటే... ఏడాది కాలంలో 122 మంది సహస్ర కోటీశ్వరులుగా మారారు. అయితే, వీళ్లలో అధిక శాతం మందికి సంపద వారసత్వంగా వచ్చినట్టు తెలిపింది నివేదిక. సంపదను సృష్టించడంతో పాటు దాని పరిరక్షణపై దృష్టి సారించినపుడే ఇది సాధ్యమని ఐ.ఐ.ఎఫ్.ఎల్  వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సహ వ్యవస్థాపకుడు యతిన్‌ షా అభిప్రాయపడ్డారు.  ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై భారత్‌ దృష్టి సారించడం వల్ల... రానున్న ఐదేళ్లలో భారత్‌లో సంపన్నుల సంఖ్య మూడింతలవుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: