అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఆయన భార్య వెనెస్సా ట్రంప్‌తో కలిసి భారత్ పర్యటనలో భాగంగా పలు ముఖ్య ప్రదేశాలను సందర్శించారు. గురువారం వారు ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్ మహల్‌ను దర్శించారు. ఆ కట్టడాని చూసి ఇంప్రెస్ అయ్యారు. వావ్ అంటూ పొగిడేశారు. తెల్లటి మారబుల్ రాతితో నిర్మితమైన ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూసిన తమ అనుభవాన్ని ట్రంప్ జూనియర్ విశేషంగా అభివర్ణించారు. ‘‘తాజ్ మహల్ నిజంగా ప్రపంచంలోని అత్యద్భుతమైన కళాఖండాల్లో ఒకటి. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి అయినా ఇక్కడికి రావాలి" అని ప్రశంసలు కురిపించారు.


తాజ్ మహల్ సందర్శన అనంతరం ట్రంప్ జంట, అనంత్ అంబానీ ఫ్యామిలీ ఆహ్వానం మేరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు ప్రయాణమయ్యారు. అక్కడ అనంత్ అంబానీ సంరక్షణలో నడుస్తున్న వంటారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంను సందర్శించారు. పలు అరుదైన జంతువుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రం గురించి వారికి వివరణాత్మకంగా వివరించారు. అనంతరం సమీపంలోని ఒక ప్రముఖ దేవాలయాన్ని కూడా దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లతో కలిసి ట్రంప్ జూనియర్ దంపతులు సంప్రదాయ దాండియా డాన్స్‌లో పాల్గొనడం అక్కడి అతిథులను మరింత ఆకట్టుకుంది. భారతీయ సంస్కృతి, ఆతిథ్యం తమను ఎంతో ఆకర్షించిందని వారు తెలిపారు.



జామ్‌నగర్ పర్యటన పూర్తి చేసుకున్న అనంతరం వారు ఉదయ్‌పూర్‌కు వెళ్లి, అక్కడ జరగనున్న అంబానీ కుటుంబ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు. భారతదేశంలోని రాయల్ హెరిటేజ్, సంస్కృతి, ఆహార వైవిధ్యం తమపై గొప్ప ప్రభావం చూపిందని ట్రంప్ జంట పేర్కొన్నారు. ఇదే సమయంలో, గత ఏప్రిల్‌లో కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌ను సందర్శించిన విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు కూడా తాజ్ మహల్‌ను సందర్శించి, ఆ నిర్మాణ కళా వైభవానికి పూర్తిగా మంత్రముగ్ధులయ్యారని పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: