ఆక్సీజన్ అందక కరోనా రోగి మృతి.. ఇప్పుడు ఈ వార్తలు చాలా సర్వసాధారణం అయ్యాయి. కరోనా సెకండ్ వేవ్‌లో చాలామంది కరోనా రోగులకు ఆక్సీజన్ అవసరం అవుతోంది. సకాలంలో ఆక్సీజన్ పెట్టకపోతే రోగి ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు ఆక్సీజన్ అత్యవసరంగా మారింది. అయితే.. రోగి ఆస్పత్రికి వెళ్లడం.. అక్కడ ఆక్సీజన్ అందుబాటులో ఉండటం.. ఇవన్నీ జరిగే సరికి రోగుల ప్రాణాలు పోతున్నాయి. అందుకే బెంగళూరులో ప్రభుత్వం ఓ వినూత్న ప్రయోగం చేసింది.

బెంగళూరు మెట్రో బస్సుల్లో కొన్నింటిని మొబైల్ ఆక్సీజన్ కేంద్రాలుగా మార్చారు. బస్సుల్లో ఆక్సీజన్ సౌకర్యం కల్పించారు. ఆ బస్సులు నగరవ్యాప్తంగా తిరుగుతుంటాయి. ఎక్కడైనా కరోనా రోగికి ఆక్సిజన్ అవసరమైతే.. ఆ బస్సులో ఆక్సీజన్ ఇస్తారు. అదే బస్సులో రోగిని ఆస్పత్రికి తరలిస్తారు. ఇలా బస్సుల్లో ఆక్సీజన్ ఇవ్వడం చాలా మంది రోగులను కాపాడుతోంది. అనేక స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి.  

ఈ కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సీజన్ అత్యవసరంగా మారుతోంది. మొన్నటికి మొన్న ఓ ఆక్సిజన్ ట్యాంకర్‌ సమయానికి రాలేకపోయిన కారణంగా తిరుపతిలో ఏకంగా 11 మందికిపైగా  కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఐదంటే ఐదు నిమిషాలు ఆక్సిజన్  ట్యాంకర్ ఆలస్యంగా  రావడం కారణంగా కరోనా రోగులు ఊపిరి ఆగిపోయింది. అంతకుముందు  హైదరాబాద్‌లోని కోఠి కొవిడ్ ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ అందక ముగ్గురు రోగులు ప్రాణాలు వదిలారు.

ఉత్తర భారతంలో అనేక ఆస్పత్రుల్లో సకాలంలో ఆక్సీజన్ అందక రోగులు ప్రాణాలు వదిలారు. అందుకే ఇలాంటి వినూత్న పద్దతుల ద్వారా కరోనా రోగుల ప్రాణాలు కాపాడొచ్చు. ఇప్పటికే కొందరు ఆటో డ్రైవర్లు కూడా తమ ఆటోలకు ఆక్సీజన్ సిలిండర్ సౌకర్యం అందిస్తూ కరోనా రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. గాలిలో ఉచితంగా లభించే ఆక్సీజన్ సకాలంలో అందక ఓ రోగి ప్రాణం పోవడం కంటే దారుణం ఏముంటుంది. ఆ దారుణాలు ఆపేందుకే ఈ ప్రయత్నాలన్నీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: