ఏపీలో ఇటు టీడీపీతో పొత్తుతో అటు వైసీపీతో తెర వెనుక స్నేహంతో సేఫ్ గేమ్ ఆడుతున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో కనీసం 12 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీ గత శాసన సభ ఎన్నికల్లో 14శాతం ఓట్లు సాధించింది.  


అయితే ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ నేతలు మోదీ నామ జపం చేస్తున్నారు. ప్రధాని కాబట్టి ప్రధాని చరిష్మా ఉపయోగించుకోవడంలో తప్పు లేదు కానీ.. వాళ్ల గురించి చెప్పుకోకపోవడమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి సైతం తనను చూసి కాదని.. నరేంద్ర మోదీకి ఓటు వేయాలని చెబుతున్నారు. ఒక  కేంద్ర మంత్రిగా తాను లోక్ సభ సెగ్మెంట్ కి చేసిన అభివృద్ధి పనులు.. రాష్ట్రానికి తెచ్చిన నిధులను చెప్పుకోవడం మానేసి.. మోదీ నామస్మరణ చేస్తున్నారు.


కిషన్ రెడ్డే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకుల పరిస్థితి ఇలానే ఉంది. దీనికి కారణాలు లేకపోలేదు. బీజేపీ గెలుపు కోసం ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ సంఘాలు పని చేస్తుంటాయి. ఆది నుంచి పార్టీలో ఉన్న నాయకులతో వీరికి ఎనలేని సంబంధం ఉంటుంది. కానీ ఈసారి ఎన్నికల్లో బీజేపీ వలస నేతలకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో వీరు అసంతృప్తికి లోనయ్యారు.


వేరే పార్టీ నుంచి వచ్చిన వారి గెలుపు కోసం పనిచేయడం వీరితో పాటు బీజేపీ కార్యకర్తలకు కష్టంగా మారింది. అందుకే మోదీ బొమ్మను చూపించి.. తమ కోసం కాదని.. బీజేపీ కోసం పనిచేయాలనే నినాదాన్ని ప్రజల్లోకి,.. బీజేపీ అనుబంధ సంఘాల నాయకులకు చెబుతున్నారు. వ్యక్తిగతంగా కూడా మోదీకి ఉన్న క్రేజ్ తెలంగాణ బీజేపీ ఎంపీలకు లేకపోవడం ఒక మైనస్ గా చెప్పవచ్చు. అందుకే వీరు మోదీని, బీజేపీని ముందు పెట్టి తమ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: