
ఇక ఒక్కొక్కరుగా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వివాదాస్పద మార్గంలో నడుస్తున్నారు. కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియలతో పాటు గుంటూరుకు చెందిన కొందరు ఎమ్మెల్యేలపై కూడా విమర్శలు వచ్చాయి. ఇవన్నీ రాజకీయ పరిణామాలకే పరిమితమయ్యినా, తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం పార్టీని బాగా ఇబ్బంది పెట్టాయి. ఒక ఎమ్మెల్యే నేరుగా జూనియర్ ఎన్టీఆర్‌పై బూతుల పరంపర పెట్టిన ఆడియో బయటకు రావడం పెద్ద దుమారమే రేపింది. దీనిని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుని తీవ్రంగా ప్రచారం చేసింది. గుంటూరుకు చెందిన మరో కొత్త ఎమ్మెల్యే ఫోన్‌లోనే రాసలీలలు చేశారని వచ్చిన ఆరోపణలు పార్టీని మరింత ఇరుకున పడ్డాయి. ఎంత తప్పించుకోవాలనుకున్నా, సాక్ష్యాలతో బహిర్గతం కావడంతో పార్టీకి నష్టమే కలిగింది.
ఇదే సమయంలో సీనియర్ నేత, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఓ టీచర్‌ను బెదిరించారన్న ఆరోపణలు బయటకు రావడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఈ పరిణామాలతో పార్టీ ప్రతిష్టే ప్రమాదంలో పడిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఇకపై ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నా, వాటి అమలు ఎంతవరకు జరుగుతుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం, కొన్ని ఎమ్మెల్యేల తీరుతో టీడీపీ ఇబ్బందులు పడుతున్నది వాస్తవమే.