
‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన’ అనే సామెత వినే ఉంటాం. సామెత గురించి తెలియదు కానీ పలుచటి మజ్జిగతో మాత్రం చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి మజ్జిగ చాలా అవసరం. ఈ పానీయం బాడీకి చేసే మేలు అంతా ఇంతా కాదు. కూల్ డ్రింక్స్ కంటే సహజ ఆహారం మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు. వేసవిలో చల్ల చల్లగా తాగితే మనకు అనేక లాభాలు కలుగుతాయి.
1. వేసవిలో చల్ల చల్లగా మజ్జిగను తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండకు వెళ్లి వచ్చే వారు ఇంటికి చేరుకోగానే చల్లని మజ్జిగలో నిమ్మకాయ పిండుకుని తాగితే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తీరుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరంలో ద్రవాలు సమతూకంలో ఉంటాయి.
2. మజ్జిగను తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. అందువల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
3. కాల్షియం లోపం ఉన్నవారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి.
4. మజ్జిగను తాగడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది.
5. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ ఏ, డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి. ఆరోగ్యకరమైన ప్రేగులు బలమైన రోగనిరోధక శక్తికి పునాది. మజ్జిగ ఆరోగ్యకరమైన పేగులకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది. ఇది జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు అన్నింటిని సెట్ చేస్తుంది. పెద్దపేగుల్లో అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగజేసే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వ్యాధి నివారణలో మజ్జిగ సహాయపడుతుంది. అందులోని యాసిడ్ కారణంగా మీ పొట్టను క్లియర్ చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గించవచ్చు.
6.పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగ మన జీర్ణవ్యవస్థకు ఒక వరం. మజ్జిగలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.